KTR Warangal Tour: ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పర్యటించనున్నారు. సాయంత్రం వరకూ పలు ప్రాంతాల్లో పర్యటించి... 236 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కేటీఆర్ రాకను పురస్కరించుకుని నగరం మొత్తం గులాబీమయంగా మారిపోయింది. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి.. నగరానికి రెండు వైపులా జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఓరుగల్లు గులాబీమయంగా మారిపోయింది.
కేటీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు పార్టీనేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. నగరాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై... జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో కేటీఆర్ హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షించనున్నారు. నగరానికి బృహత్తర ప్రణాళిక, నియో మెట్రో రైలు కొత్త ఐటీ సంస్ధల ఏర్పాటు... మొదలైన అంశాలపై కేటీఆర్ సమీక్షిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు హయగ్రీవాచారి మైదానంలో పార్టీ ప్రతినిధుల సభలో పాల్గొంటారని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్లు తెలిపారు.
దేశంలోనే మరేక్కడా లేని విధంగా... ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం చేతులెత్తేసిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకువచ్చి... కొనుగోళ్లకు సిద్ధమై అన్నదాతలను ఆదుకుంటున్న విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా మార్గనిర్దేశనం చేస్తారు. విపక్షాల అర్ధంలేని విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలంటూ.... పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఇవీ చదవండి: