వరంగల్ ఎంజీఎంలో కరోనా బాధితులు, సాధారణ రోగులకు అందించాల్సిన వైద్య సేవలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఒక్క కరోనా బాధితుడు కూడా ఇబ్బంది పడవద్దని, కరోనా బాధితులందరికి ఎంజీఎంలోనే పూర్తి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
కరోనా సమయంలో వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి జీతాలు పెంచేందుకు జీవో జారీ చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంజీఎంను పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. వెంటిలేటర్స్, పీపీఈ కిట్స్ వెంటనే సమకూర్చాలని ఆదేశించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు.
కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు, ఎంజీఎంను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, హోమ్ క్వారంటైన్ లో చికిత్సపొందే వారికి అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వైద్యుల వసతి కోసం హరిత కాకతీయ హోటల్‌ను కేటాయిస్తున్నామని, ఆందోళన చెందవద్దని, హైదరాబాద్‌కు పరుగులు పెట్టవద్దని మంత్రి సూచించారు. ప్రైవేటు వైద్యుల సేవలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ఎంజీఎంలో తక్షణమే వెంటిలేటర్లు సమకూర్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.