లాక్డౌన్ కొనసాగింపుపై ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తమ అభిప్రాయాలు చెప్పారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఆదివారం జరిగే కేబినెట్ సమావేశంలో వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో వరి ధాన్యం సేకరణ, కరోనా నియంత్రణ, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని, తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. కరోనా క్రమంగా నియంత్రణలోకి వస్తోందని, ఎక్కడ అలక్ష్యం వహించకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎంజీఎంతో పాటుగా ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, పడకలు కూడా పెంచుతున్నామని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆగం కావొద్దని సూచించారు. అందరికి వ్యాక్సిన్ అందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగంగానే వాహకులకూ వ్యాక్సిన్ ఇస్తున్నామని అన్నారు.