భాజపా నేతలు తప్పుడు ప్రచారంతో మోసం చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. దుబ్బాకలో ఓ కార్యకర్తను బలిచేసి గెలిచారని ఆరోపించారు.
వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలమయితే కేంద్రం పట్టించుకోలేదని ఎర్రబెల్లి మండిపడ్డారు. హైదరాబాద్ నగరం వరదల ధాటికి అతలాకుతలం అయితే ఆదుకోవాలనే సోయి కూడా కేంద్రానికి లేదన్నారు. భాజపా నేతలవి బోగస్ మాటలని.. ప్రజలు వారిని నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాజపా పాత్ర ఎంటని ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే ఆ పార్టీ నేతలను తరిమికొడతారని ఎర్రబెల్లి అన్నారు. హన్మకొండలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు.
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉండడం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు రాష్ట్రానికి.. కేంద్రం ఏం ఇచ్చిందో సాక్ష్యాలతో చూపించే ప్రయత్నం చేయండి. దుబ్బాక ఉపఎన్నికలో తప్పుడు ప్రచారంతో.. కార్యకర్తను బలిచేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉపసంహరించుకున్నారని ప్రచారం చేసి ఫలితాల్లో లబ్దిపొందారు. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్.. కేసీఆర్ టీం సహించదు.
-ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి.
ఇవీచూడండి: కాంగ్రెస్, భాజపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: హరీశ్