వరంగల్‌లో నిర్వహిస్తున్న ఫిట్ హెల్త్ వర్కర్స్ క్యాంపెయిన్ ముమ్మరంగా సాగుతోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి లలితాదేవి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముందుగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి నాలుగు రోజుల పాటు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన స్ర్కీనింగ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించి... అవసరమైనవారికి మందులు ఇస్తున్నారు.
జిల్లాలోని 1625 మంది వైద్య సిబ్బందికి పరీక్షలు పూర్తి చేసిన తర్వాత 1500 మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు, పరీక్షలు నిర్వహించారు. వరంగల్ నగరపాలక సంస్థ, పారిశుద్ధ్య కార్మికులకు, మునిసిపల్ సిబ్బందికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని ముందుగా ర్యాపిడ్ యాంటిజెన్ ద్వారా కొవిడ్ పరీక్షలు నిర్వహించి... నెగిటివ్ ఫలితాలు వచ్చిన వారికి మిగిలిన పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇటు పరీక్షల నిర్వహణపై సిబ్బంది, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బయట ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని... ఉచితంగా తమకు పరీక్షలు చేసి మందులిస్తున్నందుకు అధికారులకు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
పరీక్షలకు సంబంధించిన వివరాలను ఆయుష్మాన్ భారత్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. కొవిడ్ పాజిటివ్ వచ్చినవారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి కిట్లు అందిస్తున్నారు. వారితో ప్రత్యక్ష సంబంధాలు కలిగినవారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.