Floods Effect in Bhadrachalam : గోదావరి వరదలకు అతలాకుతలమైన కుటుంబాలు ఆపన్న హస్తాలవైపు చూస్తున్నాయి. పరీవాహకంలో వచ్చిన భారీ వరదలకు కొందరి గృహాలు పూర్తిగా, మరికొందరివి పాక్షికంగా కూలిపోయాయి. ఇళ్లు, మరుగుదొడ్ల మరమ్మతుకు కనీసం రూ.50 వేలైనా అవసరమని బాధితులు పేర్కొంటున్నారు. వరద సృష్టించిన విలయానికి ఒక్కో మండలంలో వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఐదారు రోజులు నీళ్లలోనే ఇళ్లు ఉండిపోయాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పైకి నష్టం మరీ ఎక్కువగా కనిపించకపోయినా లోలోపల నిర్మాణాలు చెడిపోయి ఉంటాయని ఇంజినీరింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మట్టితో కట్టిన గృహాలైతే కొన్నాళ్లకు కుప్పకూలిపోతాయని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఎప్పుడు ఇస్తారంటూ గ్రామాలకు వస్తున్న అధికారులను బాధితులు ఆరా తీస్తున్నారు. గ్రామాల్లో రెవెన్యూ బృందాలు బాధితుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, దెబ్బతిన్న ఇళ్ల సమాచారాన్ని నమోదు చేశాయి.
- గోదావరి వరదలకు భద్రాద్రి జిల్లా ఎక్కువగా నష్టపోయింది. 109 గ్రామాల్లో భారీ నష్టం చోటుచేసుకుంది. 17,400 ఇళ్లు ముంపునకు గురైనట్లు ఆ జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది.
- బూర్గంపాడు మండలంలో ఏడు వేల ఇళ్లు వరద ప్రభావానికి గురయ్యాయి.
- అశ్వాపురం మండలంలో 1,458 ఇళ్లను వరద చుట్టుముట్టగా ఇప్పటి వరకు 57 ఇళ్లు కూలిపోయాయి.
- చర్ల మండలంలో పది గ్రామాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. 2,289 ఇళ్లు మునిగిపోగా.. 90 గృహాలు కూలిపోయాయి.
- దుమ్ముగూడెం మండలంలో 131 గృహాలు కూలిపోయినట్లు గుర్తించారు. పూర్తి నష్టంపై సర్వే కొనసాగుతోంది
- భద్రాచలంలో 2,913 ఇళ్లు ముంపునకు గురయ్యాయి.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,117 గృహాలు పాక్షికంగా దెబ్బతినగా.. 57 నివాసాలు కూలిపోయాయి.
- ములుగు జిల్లాలో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 227 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, 31 ఇళ్లు కుప్పకూలాయి.
పాడైన మరుగుదొడ్లు.. వరదలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో బురద, ఒండ్రు, ఇసుక మేటలు వేశాయి. ఇళ్లలోకి ప్రవేశించిన బురదను బాధితులు కడిగి శుద్ధి చేసుకున్నారు. కానీ, మరుగుదొడ్డి రంధ్రం నుంచి బురద నీరు చేరి సెప్టిక్ ట్యాంకుల్లో నిండిపోయింది. ఈ ఒండ్రును తొలగించలేని పరిస్థితి ఉందని ముంపుప్రాంత వాసులు చెబుతున్నారు. ఒక్కో మరుగుదొడ్డి మరమ్మతుకే కనీసం రూ.పది వేలకుపైగా ఖర్చవుతుందని పేర్కొంటున్నారు. ఈ సమస్య ఏర్పడటంతో వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారని బాధితులు వాపోతున్నారు.