పేదల కోసం నిర్మించిన రెండు పడకల ఇళ్లు.. పలుచోట్ల అలంకారప్రాయంగా మిగిలిపోతున్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి వేషాలపల్లిలో.. రూ.33 కోట్ల అంచనా వ్యయంతో జీ ప్లస్ త్రీ విధానంలో 544 ఇళ్లు నిర్మించారు. 34 బ్లాకుల్లో ఒక్కో బ్లాక్‌లో 16 ఫ్లాట్ల చొప్పున ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కొత్త సాంకేతిక పద్ధతులతో 2018లో ప్రారంభించి.. 2019 మార్చి పూర్తిచేశారు. అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, విద్యుత్, తాగునీరు, ఫంక్షన్‌హాల్ తదితర సకల సౌకర్యాలు కల్పించారు. ఇళ్ల నిర్మాణం పూర్తై దాదాపు రెండేళ్లు కావస్తున్నా....ఇంతవరకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టలేదు . మున్సిపాలిటీ పరిధిలో 2,586 మంది పక్కా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని.. సొంతింటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇళ్లు లేక రహదారుల పక్కన గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.
పట్టించుకోకపోయేసరికి పాతబడుతున్నాయి..
ఇళ్లు నిర్మించి వదిలేయడంతో ప్రాంగణంలో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి.. పరిసరాలు అధ్వానంగా తయారయ్యాయి. నిర్మించిన ఇళ్లలోని సామగ్రిని ఆకతాయిలు ధ్వంసంచేయడం, దొంగలు ఎత్తుకెళ్లడం వంటివి జరుగుతున్నాయి. ఇటీవలే మున్సిపల్ అధికారులు.. ఇళ్ల కాపలాకు సిబ్బందిని నియమించారు. దరఖాస్తులను వార్డుల వారీగా పరిశీలించి.. అర్హులైన వారికి ఇళ్లను కేటాయిస్తామని చెబుతున్నారు. త్వరగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి.. తమకు గూడు కల్పించాలని పేదలు విజ్ఞప్తి చేస్తున్నారు
ఇవీ చూడండి: మనసు దోచే లక్నవరం.. పర్యటకుల పాలిట స్వర్గధామం