గ్రేటర్ వరంగల్ బరికి ఇంకా 3 నెలలు ఉండగానే ఎన్నికల వేడి మొదలైంది. తెరాస, భాజపా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల వరంగల్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన భాజపా శ్రేణుల్లో జోష్ నింపింది. తెరాసకు వ్యతిరేకంగా పిడికిలి బిగించి పోరాటం చేయాలని.. ఎలాంటి తెగింపుకైనా సిద్ధంగా ఉండి విజయకేతనం ఎగరేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. గ్రేటర్ ఎన్నికలతో మార్పు దిశగా మరో అడుగు పడాలని దిశానిర్దేశం చేశారు. కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని... కేంద్ర పథకాలు సరిగ్గా అమలు కావట్లేదని ఆరోపించారు. అదే స్ధాయిలో తిప్పికొట్టిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు... భాజపా నేతలకు ఎన్నికలప్పుడే అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిచారు.
వరంగల్‌లో పనులు నత్తనడకన జరుగుతుండడం వల్ల ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయన్న భావనతో.. ఇకపై పరుగులు పెట్టించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా కలెక్టర్, కమిషనర్, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేయాలని, దెబ్బతిన్న రహదారులకు సత్వరమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ప్రతి డివిజన్ సుందరంగా కనిపించాలని... అభివృద్ధి పనుల్లో రాజీపడవద్దని, పనిచేయని గుత్తేదారులను బ్లాక్‌లిస్టులో పెట్టాలని సూచించారు. ఫిబ్రవరి నుంచి ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందించడానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఫిబ్రవరిలో రెండు పడకల గదుల ప్రారంభోత్సవాలకు ముహూర్తం ఖరారు చేశారు. వరంగల్‌లో పెండింగ్ పనులపై మంత్రి కేటీర్ సైతం హైదరాబాద్‌లో వరంగల్ నేతలతో ఈ నెల 21న సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.