వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. గ్రామంలో ఇంటి పన్నుల నిర్వహణ, అనుమతుల జారీ, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని... వ్యవసాయేతర భూమిగా మార్చుకునే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణం... భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం పలు సూచనలు చేశారు.
ఏనుగల్ గ్రామం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ స్వస్థలం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసి మాట్లాడడం పట్ల పంచాయతీ కార్యదర్శి రమాదేవి ఆనందం వ్యక్తంచేశారు. సంభాషణ ఇలా సాగింది.
సీఎం: హలో నమస్తే అమ్మా..
కార్యదర్శి: నమస్తే సర్..
సీఎం: మీ గ్రామంలో ఎవరైనా ఇల్లు అమ్ముకుంటే దాన్ని మ్యుటేషన్ చేసేది మీరేనా..
కార్యదర్శి: ఆన్‌లైన్‌లో రికార్డు చేశాక పంచాయతీలో నమోదు చేస్తాం సర్..
సీఎం: మీ ఊళ్లో ఎన్ని ఇళ్లున్నాయమ్మా..
కార్యదర్శి: 922.. రికార్డులో లేనివి ఇంకో 50 ఉంటాయి సర్..
సీఎం: ఒక ఇంట్లో తండ్రి చనిపోయాడు.. ఆయన ఇద్దరు కొడుకులు వచ్చి స్థలం పేరు మార్పిడి చేయమంటే చేసేది మనమే కదా!
కార్యదర్శి: ఆ సర్.. రెవెన్యూకు, రిజిస్ట్రార్ ఆఫీసుకు సంబంధం లేదు సర్.
సీఎం: ఒకాయన వచ్చి తన ఇంటిని బిడ్డల మీద మార్పిడి చేశానని, బైఫర్‌కేషన్ చేయమని చెప్తే చేసేది మనమే కదా..
కార్యదర్శి: అవున్సార్..ఆయన తెచ్చి ఇచ్చిన కాగితం ఆధారంగా ఆన్‌లైన్‌లో ఎంటర్‌చేసి నంబరు ఇస్తాం సార్..
సీఎం: అంటే గ్రామ కంఠంలో ఉంది కాబట్టి మొత్తం మన పంచాయతీలోనే ఇవన్నీ చేస్తాం కదా..
కార్యదర్శి: సర్ ఒక మాట అడగనా..
సీఎం: చెప్పమ్మా..
కార్యదర్శి: కొందరు వాళ్ల సొంత పొలంలో ఇల్లు కట్టుకొని రికార్డు చేయమంటే మనం చేయలేం కదా సార్..
సీఎం: మనమే చేయాలి.. ఎందుకంటే నా సంగతే చెబుతా.. నాకు, నా కొడుక్కి కలిపి 100 ఎకరాల్లో ఫాం హౌస్ ఉంది. ఈ ఫాంహౌస్‌లోని ఎకరన్నర భూమిలో ఇల్లు కట్టుకున్నా..చట్టపరంగా కట్టుకోవాలంటే ఏం చేయాలని అందరినీ అడిగా..గింత ఫీజు కడితే దాన్ని కన్వర్ట్ చేస్తామన్నారు.ఎకరన్నరకు ఫీజు కట్టినాక కన్వర్టు చేసిండ్రు..ఇప్పుడు గ్రామ పంచాయతీ అవసరం పడ్డది..అది ఇళ్ల స్థాయిని బట్టి ఉంటది కదా..నాది డీపీఓ లెవల్‌కుపోయింది..ఆయన పర్మిషన్ ఇచ్చిండ్రు.. నేను కట్టిన ఫీజు పంచాయతీకి పోయింది.. ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చేసినా... ఇదంతా ఎర్రవల్లి గ్రామంలో జరిగిందమ్మా..
కార్యదర్శి: మీరు యాగం చేసినప్పుడు నేనూ,అమ్మా ఆ ఊరు వచ్చినం సర్..
సీఎం: యాగం చేసిన జాగా ఉందే అదే మా వ్యవసాయభూమి.. అందులోనే ఇల్లు కట్టుకున్నా.. ఇప్పుడు గ్రామంలో ఎవరు ఇల్లు కట్టుకున్నా.. మీ పర్మిషన్ తీసుకోవాలి కదా..
కార్యదర్శి: అవున్సార్..
సీఎం: ట్యాక్స్ కూడా కట్టాలి..
కార్యదర్శి: అవున్సార్..
సీఎం : నా ఇల్లు ఇప్పుడు గ్రామ కంఠంలో ఉన్నట్లు లెక్కొచ్చింది. కాబట్టి నేను కూడా పంచాయతీకే టాక్స్ కట్టాలి. ఇది చట్టం. మీరిప్పుడు ఏమి చేయాలంటే.. మీ దగ్గర రికార్డులో ఏవి ఉంటే వాటిని వెంటనే రికార్డు చేసేయండి..
కార్యదర్శి: చేసేస్తాం సర్..
సీఎం: దాన్ని కన్వర్ట్ కూడా చేసుకోమని చెప్పండి..
కార్యదర్శి: కన్వర్ట్ చేసుకోం అని చెబితే సార్..
సీఎం: ఇబ్బంది పడతారని చెప్పండి.. చేసుకోకపోతే కల్వదని చెప్పండి..ఒకే అమ్మా..థాంక్యూ
కార్యదర్శి: థాంక్యూ సోమచ్ సర్..