రామగుండం-3 పరిధిలో నిర్మాణంలో ఉన్న 50 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంటుకు మరో 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ విభాగాన్ని అనుసంధానం చేసినట్లు సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. రామగుండం రీజియన్‌లో 30 శాతం విద్యుత్ అవసరాలను ఈ సోలార్ ప్లాంట్ తీర్చనుందన్నారు. దీనితో కలిపి సోలార్ ప్లాంటు నుంచి మొత్తం 30 మెగావాట్ల సోలారు విద్యుత్ ట్రాన్స్‌కోకు అనుసంధానం అయిందని వివరించారు.
మొదటి దశలోని 129 మెగావాట్ల సామర్థ్యంలో ఇప్పటికే 85 మెగావాట్ల సింగరేణి సోలార్ పవర్ ట్రాన్స్‌కోకు అనుసంధానమైందన్నారు. మిగిలిన 20 మెగావాట్ల విభాగాన్ని వచ్చే నెల చివరికల్లా అనుసంధానం చేస్తామని వివరించారు. సోలార్ విద్యుత్ అనుసంధానంపై సంబంధిత అధికారులకు, ఉద్యోగులకు తన అభినందనలు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా మూడు దశల్లో నిర్మిస్తున్న సోలార్ ప్లాంటుల్లో ఇప్పటికే మొదటి దశలోని నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయన్నారు.
మణుగూరు నుంచి 30 మెగావాట్లు, రామగుండం-3 నుంచి 30 మెగావాట్లు, ఇల్లందు నుంచి 15 మెగావాట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని సోలార్ ప్లాంటు నుంచి 10 మెగావాట్లు ఇప్పటికే ట్రాన్స్‌కోకు అనుసంధానమైనట్లు పేర్కొన్నారు. తొలి దశలో ఇంకా మిగిలి ఉన్న 44 మెగావాట్లను వచ్చే నెల చివరికల్లా అనుసంధానం చేయాలని, రెండవ దశలోని 90 మెగావాట్ల ప్లాంటు నిర్మాణాన్ని మే చివరికల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మూడో దశలో నిర్మించే 81 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం కూడా ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తద్వారా మొత్తం 300 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తేవాలని శ్రీధర్ ఆదేశించారు.