Central Minister Mahendranath Pandey: అసత్య పాలన చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సత్యాగ్రహ దీక్షలు చేస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విశ్వాసాన్ని కోల్పోయినా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రజలెలా నమ్ముతారని.. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెరాస ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
నిజామాబాద్ స్పైస్ బోర్డుకు 30 కోట్లు మంజూరు చేశామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల రవాణా కోసం ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నామన్నారు. కవిత ఎంపీగా ఉన్నపుడు పసుపు రైతుల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు తెలంగాణ ఎంతో అనుకూలమని.. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే సహకరిస్తామన్నారు. అసత్య పాలన చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సత్యాగ్రహ దీక్షలు చేస్తోందన్నారు. భాజపా తెలంగాణలో అధికారంలోకి వస్తే మూతబడిన చక్కెర పరిశ్రమలను తిరిగి తెరుస్తామని హామీనిచ్చారు.
'వాళ్లు పార్టీ పేరు ఎలాగైనా మార్చుకోనివ్వండి. ప్రజలు ఎన్నుకున్నందుకు ముందుగా రాష్ట్రంలో సరైన పాలన సాగిస్తే చాలు. 8ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇక గద్దె దిగే సమయం ఆసన్నమైంది. మిగిలిన కొద్దిరోజులైనా రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించాలి. పార్టీని వారు ఏ రూపంలోనైనా తీసుకురానివ్వండి.. దానివల్ల ఒరిగేది ఏంలేదు. ముందు రాష్ట్రాన్ని సరిగా పాలించమనండి. త్వరలోనే మేం రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం. ప్రజలకు సేవ చేయబోతున్నాం.'-మహేంద్రనాథ్ పాండే, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి
ఇవీ చదవండి:భాజపా కుట్రలను వివరిస్తున్నందుకు ఆ పత్రికపై కేసు: రేవంత్‌రెడ్డి