ఒకప్పుడు కులవృత్తులు ఓ వెలుగు వెలిగాయి. ఆధునిక జీవన మార్పులతో రానురానూ వాటిని వదిలేసి ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. కులవృత్తులు మళ్లీ పూర్వ వైభవం దిశగా సాగుతున్నాయి. ఉపాధి హామీ, హరితహారం పథకాలను వినియోగించుకుని నిజామాబాద్ జిల్లాలో ఈత వనాల పెంపకం మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లా గీతకార్మికులు.. కులవృత్తుల్ని నమ్ముకుని ఉపాధి ఎలా పొందాలో యువతకు చూపిస్తున్నారు.
అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో..
నిజామాబాద్ జిల్లాలో గీతకార్మికులు అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఈతవనాలు పెంచుతున్నారు. ఆ మొక్కల నిర్వహణ సైతం ఉపాధి హామీ కింద చేస్తున్నారు. నీరు పట్టడం, చెత్తను తీసేయడం వంటి పనులను ఉపాధి హామీ కింద చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 69 ప్రాంతాల్లో 95వేల మొక్కలు నాటించారు. చాలా చోట్ల ఈ ఏడాదిలో కల్లునిచ్చే దశకు చెట్లు ఎదిగాయి. ఈత వనాల పెంపుతో ఉపాధి లభించి వలసలకు అడ్డుకట్ట పడుతుందని గీత కార్మికులు భావిస్తున్నారు.
బిందుసేద్యం ద్వారా..
లాక్‌డౌన్ కారణంగా ముప్కాల్ మండలం నల్లూర్‌లో గల్ఫ్ దేశాలకు వెళ్లిన చాలా మంది తిరిగి వచ్చారు. ఉపాధి లేకపోవడంతో గ్రామ సమీపంలోనే రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈత వనాలు పెంచారు. మొత్తం 1750 ఈత మొక్కలు, 500 ఖర్జూర మొక్కలు నాటారు. బిందుసేద్యం ద్వారా మొక్కలకు నీళ్లు అందిస్తూ... చూట్టూ కంచె ఏర్పాటు చేశారు. రెండేళ్ల వయసున్న మొక్కలు నాటడంతో మరో నాలుగేళ్లలో చెట్లు గీతకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
యువతకు మంచి ఉపాధి అవకాశాలు..
ఇన్నాళ్లూ వివిధ పనులు చేసినా సరైన ఆదాయం లేక అవస్థలు పడిన వీరు.. ఈత వనాల పెంపుతో ఆర్థికాభివృద్ధి దిశగా సాగనున్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ఈత కల్లుకు సైతం డిమాండ్ పెరుగుతోంది. దీంతో స్థానికంగా ఉంటునే యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
ఇవీ చూడండి: 'రాష్ట్రంలో మొక్కజొన్న సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదు'