నిజామాబాద్‌కు గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతోందని ఆ నియోజకవర్గ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపణలు చేశారు. నిజామాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, ఉగ్రవాద కార్యాకలాపాలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. సీపీ నాగరాజు శాంతి భద్రత పరిరక్షణలో వైఫల్యం చెందారన్నారు. నిజామాబాద్‌లో ప్రజాప్రతినిధులను హత్య చేసేందుకు సుపారీలు తీసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీగా ఉన్న తనపైనే హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదన్నారు.
పోలీసుల సహకారంతోనే వందలాది నకిలీ పాస్‌పోర్టులతో రోహింగ్యాలు ఇక్కడ చలామణి అవుతున్నారని చెప్పారు. ‘‘జగిత్యాలకు చెందిన వ్యక్తి నిజామాబాద్ వేదికగా ఉగ్రశిక్షణ ఇస్తున్నారు. ఈ క్యాంపులో ఏపీతో పాటు తెలంగాణ వచ్చిన వారు ఉన్నారు. ఇంత జరుగుతున్నా నిజామాబాద్ సీపీ నాగరాజుకు ఎందుకు తెలియడం లేదు? ఎంఐఎం, తెరాస పార్టీలే ఆయన్ని కమిషనర్‌గా తీసుకువచ్చాయి. సీపీ నాగరాజును నిజామాబాద్ కమిషనర్ స్థానం నుంచి వెంటనే తప్పించాలి’’ అని డిమాండ్ చేశారు.
మరోవైపు, రాష్ట్రంలో ప్రజాసమస్యలు, తెరాస వైఫల్యాలపై భాజపా అధ్యయన కమిటీ తొలిసారి సమావేశం అయిందని ఎంపీ అర్వింద్ వెల్లడించారు. తెరాస ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిని విస్మరించిందని చెప్పారు. మరిన్ని సమావేశాలు నిర్వహించి ప్రజాసమస్యలను గుర్తిస్తామన్నారు. గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమస్యలను గుర్తించి రాష్ట్ర నాయకత్వానికి అందజేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: మోదీ పాలనలో వంట గదుల్లో మంటలు: కేటీఆర్