కరోనా రోగులు భయపడకుండా.. ధైర్యంగా ఉండాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సూచించారు. బాధితులకు కావాల్సిన చికిత్స అందించేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్లో కొవిడ్-19 పై అధికారులతో సమీక్షించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ధైర్యంగా ఉంటే సగం రోగం తగ్గిపోతుందని మంత్రి తెలిపారు. వైద్యులు సైతం వారికి ధైర్యం చెప్పాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు.
నిజామాబాద్ జిల్లాలో 566 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని.. ప్రస్తుతం 65 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. మొత్తం 55 వెంటిలేటర్లు అందుబాటులో ఉండగా.. ఏడుగురు వాటి మీద చికిత్స పొందుతున్నారని వివరించారు. ఆస్పత్రిలో 1157మంది చేరితే... 954 మంది కోలుకున్నారని... 150 చికిత్స పొందుతున్నారన్నారు. అవసరం ఉన్నవారికి రూ.30 వేల ఖర్చుతో రెమిడెసివిర్ ఇంజిక్షన్ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ ఛైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, రాజేశ్వర్, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్