ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలు అందరినీ కట్టి పడేస్తున్నాయి. నగరానికి 20కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకృతి నెలవై ఉంది. ఎటు చూసినా పచ్చని ప్రకృతి పలకరిస్తున్నట్టుగా కనువిందు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని మోపాల్, కామారెడ్డి, సదాశివనగర్, గాంధారి మండలాల మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ సుందర దృశ్యం నెలకొని ఉంది.
విశ్రాంతి తీసుకోవాల్సిందే..
ఈ అటవీ ప్రాంతం ఆనుకొని అన్నీ గిరిజన పల్లెలు ఉన్నాయి. ఈ ప్రాంతమంతా ఎత్తైన కొండలతో ఉంటుంది. గిరిజనులు ఈ కొండలకు అడ్డంగా వివిధ రకాల పంటలు సాగు చేస్తారు. కొండలపైన పచ్చని గడ్డి, పెద్ద పెద్ద వృక్షాలతో ఎక్కడ చూసినా... ప్రకృతి అందాలు పరవశించేలా ఉంటాయి. అటుగా ఎవ్వరు వెళ్లినా కాసేపు ఆగి విశ్రాంతి తీసుకునేలా ఆకర్షిస్తాయి. కామారెడ్డి నుంచి గాంధారి వైపు వెళ్తుంటే అందమైన ప్రకృతి స్వాగతం పలుకుతుంది. రోడ్డుకు ఇరువైపులా ఎటు చూసినా ఎత్తైన కొండలు కనిపిస్తుంటాయి. ఏపుగా పెరిగిన చెట్లతో ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి.
ఆహ్లాదం..
వర్షాకాలం రాగానే పచ్చని వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు అడవిలోని చెట్లన్ని పచ్చని ఆకులతో నిండుగా విచ్చుకున్నాయి. కొండల మధ్య గిరిజన రైతులు సాగు చేసిన వివిధ పంటలు ప్రకృతికి మరింత వన్నె తెస్తున్నాయి. ఎటు చూసినా చెట్లు, పచ్చని గడ్డి, పంటలతో పచ్చగా కనిపిస్తోంది. మోపాల్ నుంచి మంచిప్ప మీదుగా గాంధారి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా పచ్చని ప్రకృతి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుస్తున్నాయి. అక్కడి స్థానిక ప్రజలు తమ ప్రాంతాన్ని ఊటీ, అరకుగా పిలిచుకుంటారు. అక్కడుంటే పచ్చని వాతావరణం... తమకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.
చూడాల్సిందే..
కేవలం అడవులు, గుట్టలు, పంట పొలాలను మాత్రమే కాకుండా... తమ గ్రామాలను సైతం పచ్చగానే ఉంచుతున్నారు. ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపించినా చెట్లు నాటి సంతోష పడుతున్నారు. ఎక్కడో అరకులో ఎత్తైన కొండల మీద నుంచి పచ్చని చెట్లను చూసి మురిసిపోతుంటాం... కానీ అలాంటి సీనరీనే నిజామాబాద్ జిల్లాలో చూపరులను ఆకర్షిస్తోంది. వారాంతాల్లో పరిసర ప్రాంతాల ప్రజలు ఈ వాతావరణం చూసేందుకు వస్తుంటారు. ఇక స్థానిక ప్రజలైతే పచ్చని ప్రకృతి నడుమ వ్యవసాయ పనులు చేస్తూ మైమరిచిపోతుంటామని చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కలుషితం లేని స్వచ్ఛమైన పల్లెల్లో పచ్చని ప్రకృతి అందరినీ ఆహ్వానిస్తోంది. చల్లని వాతావరణంలో అందంగా కనిపిస్తున్న ప్రకృతిని ప్రతి ఒక్కరూ చూడాల్సిందే.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1284 కరోనా కేసులు, ఆరుగురు మృతి