కరోనా నేపథ్యంలో బార్లు, వైన్స్ మూసేసి.. గ్రామాల్లో సైతం కిరాణా షాపులకు ఆంక్షలు విధించిన తరుణంలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని కోతులాపురం గ్రామంలో మాత్రం ఓ బెల్టు షాపులో యధేచ్ఛగా మద్యం అమ్ముతున్నారు. మద్యం అమ్ముతున్నారన్న సమాచారం తెలుసుకున్న యువకులు ఆ షాపు దగ్గరికి చేరుకున్నారు. ముందుగా వెళ్లిన వాళ్లు బెల్టుషాపులో మద్యం తీసుకున్నారు. అక్కడే ఉన్న ఇంకో వర్గం వారు తమకు కూడా మద్యం కావాలని పట్టుబట్టారు. ఇద్దరికీ సరిపడా మద్యం లేకపోవడం వల్ల దుకాణదారుడు అక్రమంగా అనుమతి లేకుండా అమ్ముతున్న మద్యాన్ని ఒక వర్గం వారికి ఇచ్చారు. తమకు కూడా మద్యం ఇవ్వాలని, లేదంటే వాళ్లకు కూడా అమ్మవద్దని బెట్టు చేస్తూ రెండో వర్గం పట్టుబట్టింది. మాటా మాటా పెరిగి రెండు వర్గాలు గొడవకు దిగారు. అక్కడే కొందరు యువకులు, గ్రామస్థులు జోక్యం చేసుకొని వారిని చెదరగొట్టారు.
నిత్యం బెల్టుషాపుల్లో మద్యం సేవించి గ్రామంలో యువకులు ఘర్షణ పడుతున్నారని, పోలీసులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తమ ఊరిలో శాశ్వతంగా బెల్టుషాపులు మూసేయాలని అధికారలను గ్రామ యువకులు కోరుతున్నారు. ఓ వైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా లాక్డౌన్ పాటిస్తూ స్వీయ నియంత్రణలో ఉంటే.. వీళ్లు మాత్రం మద్యం కోసం తగాదాలు పడుతూ.. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
ఇదీ చూడండి : మనం ఇంట్లో ఉండటమే వారికిచ్చే బహుమతి