Revanth Reddy Latest Comments: తెరాస, భాజపాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. భాజపా, తెరాస నాయకులు ముఠాలతో, మూటలతో ఓట్లు కొల్లగొట్టేందుకు వచ్చారని ఆరోపించారు. ఈ ఉపఎన్నిక నియోజకవర్గ అభివృద్ధికి రాలేదని.. ఒక వ్యక్తి అమ్ముడుపోతే వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో ఆరోపించారు. మొక్కలా పెంచి పెద్ద చేసిన కన్నతల్లి లాంటి పార్టీకి రాజగోపాల్‌రెడ్డి ద్రోహం చేసి శత్రువు పంచన చేరాడని విమర్శించారు.
మునుగోడు ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు హామీలు ఇస్తారని ఆరోపించారు. దత్తత పేరుతో కొడంగల్ ప్రజలను మోసం చేసిన కేటీఆర్.. ఇప్పుడు మునుగోడుకు వచ్చి అవే మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. చిన్న ముల్కనూరు, మూడు చింతలపల్లి, లక్ష్మపూర్ను కేసీఆర్ దత్తత తీసుకొని ఏం చేయలేదని మండిపడ్డారు. రేపో మాపో మునుగోడుకు సీఎం కేసీఆర్ వస్తారని.. కుర్చీ వేసుకొని ఇక్కడే కూర్చుంటానని.. మునుగోడుకు సముద్రం తెస్తానని చెబుతారని ఎద్దేవా చేశారు.
స్రవంతిని గెలిపిస్తే సారక్కలా ప్రజల తరుఫున..: ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ మళ్లీ ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2014లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు.. మునుగోడులో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ఈ మాయగాళ్ల వలలో మునుగోడు ప్రజలు పడొద్దని సూచించారు. ములుగులో గెలిచిన సీతక్క సమ్మక్కలా ప్రభుత్వంపై పోరాడుతోందని.. అదే విధంగా స్రవంతిని గెలిపిస్తే సారక్కలా ప్రజల తరుఫున ఉద్యమిస్తుందని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
'కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాకు ధైర్యం. వేలాది మంది కార్యకర్తలు మాకు ఆత్మస్థైర్యంగా ఉన్నారు. కార్యకర్తల అండతోనే ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. డబ్బులతో ఓటర్లను కొనుగోలు చేయాలని భాజపా యత్నం. మునుగోడు ఓటర్లు అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేరు. అమ్ముడుపోవడానికి కార్యకర్తలేమీ గుత్తేదారులు కాదు. గుత్తేదారును కొనవచ్చు. డిండి ప్రాజెక్టు పూర్తిచేస్తే చివరి ఆయకట్టుకు నీళ్లందుతాయి. డిండి ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్ల ప్యాకేజీ ఇప్పించగలరా? భాజపా అభ్యర్థి ప్రాజెక్టులకు నిధులు తీసుకురాగలరా? ఆడబిడ్డను ఓడించేందుకు దిల్లీ నుంచి భాజపా నేతలు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు తెరాస నుంచి వంద మంది వచ్చారు.'-రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ప్రజలు ఆలోచించాలి..: తెరాస, భాజపాలు ఇచ్చిన హామీలు నెరవేర్చాయో లేదో మునుగోడు ప్రజలు ఆలోచించుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. గీతారెడ్డి, మధుయాష్కీ, సీతక్క ఇతర నేతలు భాజపా, తెరాస పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌తోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమన్నారు.
ఇవీ చదవండి: