నల్గొండ జిల్లా బత్తాయి రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. 60వేల ఎకరాల్లో పంట సాగు చేశారు. పంట కాపుకి వచ్చి దాదాపు లక్షా 50వేల టన్నుల కాయ చెట్ల మీదే ఉంది. మార్కెటింగ్ లేకపోవడం వల్ల చెట్టు మీద కాయలు రాలి కింద పడిపోతున్నాయి. దానికి తోడు అకాల వర్షాలతో చేతికొచ్చిన కాయలు నేలపాలవుతున్నాయి.
మన రాష్ట్రంలో బత్తాయి వినియోగం తక్కువగా ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునే విధంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. గతంలో క్వింటా 40 వేలు పలికిన బత్తాయి, నేడు పది వేలకు కూడా కొనేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి రాక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. బత్తాయిలో ఉండే విటమిన్-సితో రోగ నిరోధక శక్తి పెరుగుతున్నందున... ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రైతు బజార్లలో అమ్మే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: తెంపితే నష్టం..తెంపకుంటే కష్టం..