నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తెరాస అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ పేరును పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణ భవన్‌లో నోముల భగత్‌కు పార్టీ బి-ఫారంను కేసీఆర్ అందజేశారు. భగత్ రేపు ఉదయం నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. పార్టీ ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్‌ను నోముల భగత్‌కు పార్టీ అధినేత కేసీఆర్ అందించారు.
నోముల నర్సింహయ్య వారసునిగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీకి తనకు అవకాశం కల్పించడం సంతోషకరమని ఆయన తనయుడు నోముల భగత్‌కుమార్ అన్నారు. తన మీద నమ్మకముంచి టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్‌కు, పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తానని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు తెరాస అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నుంచి బీ ఫామ్ అందుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
తెరాస పార్టీలో చేరినప్పటి నుంచి తన తండ్రి నోముల నరసింహయ్యకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని నోముల భగత్ తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తన తండ్రిని గెలిపించాయని... ఎన్నికైన రెండేళ్లలోపే నాన్నను కోల్పోయి ఉప ఎన్నిక రావడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు నాగార్జునసాగర్‌లో లక్షన్నరకు పైగా ఉన్నారని భగత్ కుమార్ వివరించారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో భాజపాకు బలమేమి పెరగలేదన్నారు.