నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కరోనా తీవ్రత పెరగడం వల్ల అధికారులు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ సోమ, మంగళవారాల్లో సమీక్షలు నిర్వహించడంతో.. ఈనెల 9లోపు కేసుల శాతాన్ని ఐదుకి తగ్గించేలా కార్యాచరణకు సిద్ధమయ్యారు. మార్చిలో 3శాతం ఉన్న కేసులు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఏప్రిల్ కు వచ్చేసరికి.. 18 నుంచి 20 శాతానికి చేరుకున్నాయి. మే మొదటి వారం తర్వాత అది 25 నుంచి 35 శాతమైంది.యాదాద్రి జిల్లాలోనూ 35-40 శాతం మధ్య నమోదుతో.. ఉమ్మడి జిల్లాలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. పరీక్షలు తగ్గడం, పాజిటివిటీ రేట్ పెరగడం వల్ల గందరగోళం నెలకొంది. ఉన్నతస్థాయి బృందం జిల్లాల్లో పర్యటించాక.. వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి.
హాట్స్పాట్లు.. ఐసోలేషన్ కేంద్రాలు..
తొలుత నెలవారీగా లెక్కల్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు.. క్రమంగా వారానికి పరిమితం చేశారు. ఇప్పుడు రోజువారీగా పరిశీలన చేస్తున్నారు. బుధవారం నల్గొండ జిల్లాలో 7 వేల 508 పరీక్షలు చేస్తే... 678 మందికి కరోనా నిర్ధరణవగా పాజిటివిటీ రేట్ 9.04 శాతంగా ఉంది. ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్ని హాట్ స్పాట్లుగా గుర్తించారు. నల్గొండలోని పానగల్, మాన్యంచెల్క సహా మిర్యాలగూడ ప్రాంతాల్లో ఎక్కువ కేసులున్నట్లు తేల్చారు. డిండి, చందంపేటతోపాటు పలు మండలాల్లో పాజిటివ్ శాతం అధికంగా ఉందని గుర్తించారు. సూర్యాపేటతోపాటు హుజూర్ నగర్, కోదాడ, మునగాల, మోతె, మేళ్లచెరువు ప్రాంతాల్లో.. కేసులు పెద్దసంఖ్యలో ఉంటున్నాయి. బాధితులను అక్కడికక్కడే ఐసోలేషన్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరగడానికి కారణం పరిశ్రమలేనని... జనసంచారం అధికమై వ్యాధివ్యాప్తి చెందుతోందని నిర్ధరించారు. జిల్లాలో రెండు దశల జ్వర సర్వేల ద్వారా... 18 వేల మందిలో లక్షణాలు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 55 ఐసోలేషన్ కేంద్రాలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో కొన్ని మండలాలకు చెందిన కొవిడ్ బాధితుల్ని... పట్టణాల్లోని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
కలెక్టర్ల ఆదేశాలు..
కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో... ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సర్పంచులతో చర్చిస్తున్న అధికారులు.. అందుకు తగ్గ వసతులపై దృష్టిసారించాలంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్ని ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చి.. ఇళ్లల్లో ఉంటున్న బాధితుల్ని తరలించనున్నారు. కరోనా రోగి ఇంట్లో ఉంటే మిగతా కుటుంబ సభ్యులకు వైరస్ అంటుతున్నందున.. ప్రతి ఒక్కర్నీ ఐసోలేషన్ కేంద్రాలకు పంపించాలని కలెక్టర్లు ఆదేశించారు.