మొదట్నుంచీ ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న నాగర్ కర్నూల్లో కాంగ్రెస్‌దే పై చేయి. 9 సార్లు కాంగ్రెస్, 4సార్లు తెలుగుదేశం, ఒకసారి తెలంగాణ ప్రజాసమితి గెలిచాయి. 2014లో కారు జోరులోనూ... కాంగ్రెస్ విజయ బావుటా ఎగురవేసింది. ప్రస్తుతం సిట్టింగ్‌ను నిలుపుకునేందుకు హస్తం అస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఎలాగైనా కందనూలులో గులాబీ జెండా ఎగరవేయాలనే కృత నిశ్చయంతో తెరాస అధినేత ఉన్నారు. ఉనికి చాటుకునేందుకు కమలం పోరులో నిలిచింది. ఈ పార్లమెంటు పరిధిలో 7అసెంబ్లీ నియోజవర్గాలు, సుమారు 15 లక్షల 87 వేల ఓటర్లున్నారు.
ఖాతా తెరిచేందుకు కారు...
నాగర్‌కర్నూల్ పరిధిలో 6 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండాయే ఎగిరింది. కాంగెస్ ఖాతాలోని కొల్లాపూర్ ఎమ్మెల్యే కూడా కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఇదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి శ్రేణులు. వివాద రహితుడిగా పేరున్న మాజీ మంత్రి పోతుగంటి రాములును బరిలో దింపి, గెలుపు బాధ్యత మంత్రి నిరంజన్ రెడ్డికి అప్పగించారు. ప్రభుత్వ పథకాలు, భారీ ఆధిక్యాలతో శాసనసభ్యులు గెలవడం సానుకూలాంశాలు. ప్రతికూలతలు పెద్దగా లేకపోయినా... బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొవాల్సి రావడం సవాల్‌గా మారింది. గత ఎన్నికల్లో కారును పోలిన మరో గుర్తు ఉండటం వల్లనే ఓడిపోయామని.. ఈసారి ఎలాగైనా భారీ ఆధిక్యంతో కైవసం చేసుకుంటామని గులాబీ దళం ధీమా వ్యక్తం చేస్తోంది.
పట్టు నిలుపుకునేందుకు హస్తం...
2014లో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాల్లో నాగర్‌కర్నూల్ ఒకటి. పట్టున్న స్థానాన్ని వదులుకోవద్దనే సంకల్పంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది హస్తం పార్టీ. ఇక్కడి నుంచే రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన మల్లు రవిని మరోసారి బరిలో దింపింది. నేతలు పార్టీ మారినా పటిష్ఠమైన క్యాడర్ అండగా ఉందని భావిస్తున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకునే నాయకుడిగా మల్లు రవికి నియోజకవర్గంలో ఉన్న పేరు కలిసొస్తుందని ఆశిస్తున్నారు. సీనియర్ నేతలు డీకే అరుణ, చిత్తరంజన్ దాస్ పార్టీ వీడటం, ఉన్న ఒక్క ఎమ్మెల్యే తెరాసలో చేరడం ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.
పాగాకై భాజపా...
ఉమ్మడి పాలమూరుపై ప్రత్యేక దృష్టి సారించిన భాజపా నాయకత్వం ఎస్సీ సెల్ జాతీయ నాయకురాలు బంగారు శ్రుతిని బరిలో నిలిపింది. కల్వకుర్తి, కొల్లాపూర్‌లో పార్టీకి పట్టు ఉంది. డీకే అరుణ రాకతో గద్వాలలో అదనపు బలం తోడైంది. మోదీ అనుకూల పవనాలు, సంప్రదాయ ఓటు బ్యాంకును నమ్ముకుంటోంది కమలం. ప్రత్యర్థులతో పోలిస్తే అభ్యర్థికి పట్టు, పరిచయాలు లేకపోవడం ప్రతికూలాంశాలు.
ఇవీ చూడండి:తెలంగాణలో కారుపై చేయి ఎత్తుగడ