హుజూర్‌నగర్ ఉపఎన్నికలో స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఓ వైపు నేతలంతా ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలు జనంలోకి తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నిక సక్రమంగా జరగాలంటే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు.
"ఆత్మగౌరవానికి.. అహంకారానికి మధ్య పోరాటం"
అధికారం, మద్యం, డబ్బుతో తెరాస నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న ఎన్నికల పరిశీలకుడు ఇప్పుడు కూడా ఉండటం సమంజసం కాదని ఉత్తమ్ సూచించారు. ఈ ఉపఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి... సీఎం అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.
ప్రజానేతను గెలిపించండి: సీపీఎం
మరోవైపు ఎర్రజెండా నేతలు.. పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలో సీపీఎం బలపరిచిన తెలంగాణ ప్రజల పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేశగాని సాంబశివగౌడ్ వినూత్నంగా ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఐ సస్పెండ్
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై ఈసీ కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రచారంలో పాల్గొన్నందుకు సీఐ సైదానాయక్‌ను సస్పెండ్ చేశారు. పాలకీడు మండలం కల్మెట్ తండాలో ఈ నెల 6 నుంచి 10 వరకు విధులకు హాజరు కాకుండా హుజూర్‌నగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలపై నిజామాబాద్ రేంజ్ డీఐజీ చర్యలు తీసుకున్నారు. మటంపల్లిలోని ఓ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో 11లక్షల 56 వేల విలువైన మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు.
ఇవీ చూడండి: తెరాస నాయకుడి ఇంట్లో రూ.11 లక్షల మద్యం పట్టివేత