దళితబంధు పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు చేరింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలోని 66 కుటుంబాలకు... 10 లక్షల రూపాయల చొప్పున అందజేశారు. కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో... దళితబంధు పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. గత నెల 4న వాసాలమర్రిలో పర్యటించిన సీఎం... గ్రామాన్ని పరిశీలించడంతో పాటు అక్కడే దళితబంధును ప్రారంభించారు. గ్రామంలో మొత్తం 76 మంది దళిత కుటుంబాలు ఉండగా... ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున, రూ.7 కోట్ల 60 లక్షలు గత నెల అయిదో తేదీ నాడే కలెక్టరు ఖాతాలో జమయ్యాయి. అప్పట్నుంచి ఆ నగదును ఎలా వినియోగించాలనే దానిపై జిల్లా యంత్రాంగం... లబ్ధిదారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ప్రస్తుతానికి 66 కుటుంబాలకు నగదు చేరగా... మరో 10 కుటుంబాలకు ఒకట్రెండు రోజుల్లోనే అందుతుందని అధికారులు అంటున్నారు. బ్యాంకు ఖాతాల్లోని సమస్యలు, దస్త్రాల పరిశీలన వంటి కారణాలతో... మిగిలిన వారి నగదు బదిలీకి అంతరాయం ఏర్పడింది. అయితే మాట ఇచ్చిన ప్రకారం తమకు సాయం అందడం పట్ల... లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టమొచ్చినట్లు వినియోగించుకునే అవకాశం లేదు..
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమయినా... వాటిని ఇష్టమొచ్చినట్లు వినియోగించుకునే అవకాశం ఉండదు. ఇచ్చిన నగదు ద్వారా సత్ఫలితాలు పొందేలా వ్యాపార రంగంలో అడుగిడాలని సీఎం సూచించడంతో... ఆ కోణంలో లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. తమకు తోచిన వృత్తుల్లో రాణించేందుకు గాను నగదు ఉపయోగపడేలా... ప్రణాళికలు తయారు చేశారు. పాడితోపాటు కోళ్ల పరిశ్రమ యూనిట్లను ఎంచుకునేందుకు... పలువురు ఆసక్తి కనబరిచారు. మొత్తం 76కు గాను 29 కుటుంబాలు... డెయిరీ, కోళ్లు, మేకల పెంపకం చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. మిగతా కొంతమంది మాత్రం... వెల్డింగ్ దుకాణాలు, ట్రాక్టర్లు, ఆటోల కోసం సుముఖత వ్యక్తం చేశారు. అయితే పౌల్ట్రీ, డెయిరీ రంగాలపై అవగాహన కల్పించేందుకు లబ్ధిదారులను... యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు, భువనగిరి మండలంలోని రాయగిరి, కూనూరుకు తీసుకెళ్లారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పర్యటనలో... పాలు, కోళ్ల పరిశ్రమల నిర్వహణ తీరును అక్కడి యజమానులతో వారికి వివరింపజేశారు. అయితే లబ్ధిదారుల్లో ఎక్కువ మంది మాత్రం... వ్యవసాయ భూమిని అభివృద్ధి చేసుకునేందుకు ఉత్సుకత చూపారు.
ఆ విషయంలో స్పష్టత రాలేదు..
వ్యవసాయ భూమి అభివృద్ధికి సంబంధించి స్పష్టత రాలేదు. ఏదైనా పని ఎంచుకున్నప్పుడు దానికి నగదు బదిలీ కావాలంటే... ముందుగా కొటేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. భూమి అభివృద్ధి పేరిట కొటేషన్లు తీసుకురావడం కుదరదు. అదే వ్యాపారం వంటి వాటికైతే... ఆయా సంస్థలు, పరిశ్రమల ద్వారా కొటేషన్లు తీసుకురావచ్చు. ఈ కోణంలోనే అధికారులు... గత కొన్ని రోజులుగా లబ్ధిదారులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి తమకు దళితబంధు నిధులు అందడం పట్ల... వాసాలమర్రిలోని లబ్ధిదారులంతా ఆనందంతో ఉన్నారు.
ఇవీ చూడండి: DALIT BANDHU: 12,521 లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ