Nagarjuna Sagar Dam : తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 20 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరందించే నాగార్జునసాగర్ జలాశయానికి కాల్షియం వల్ల ముప్పు ఏర్పడుతోంది. జలాశయం లోపలి గోడల రంధ్రాల్లో పేరుకుపోయిన ఈ ఖనిజం వల్ల డ్యాం స్పిల్‌వేతో పాటు గ్యాలరీలోని గోడలకు పగుళ్లు ఏర్పడే అవకాశముందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు గోడల్లో పేరుకుపోయిన కాల్షియంను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Calcium Issue in Nagarjuna Sagar Dam : జలాశయం లోపలి వైపున నిల్వ ఉన్న నీటి ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఊట నీరు బయటకు రావడానికి గ్యాలరీల్లో ప్రతి పది అడుగుల దూరంలో ఒక రంధ్రం చొప్పున డ్యాం నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేశారు. ఇవి సుమారు 1200 వరకు ఉన్నాయి. వీటిని పోరస్ హోల్స్ అంటారు. వీటి నుంచి నీరు నిత్యం బయటకు వస్తూ ఉండటంతో ఈ నీటిలో ఉన్న కాల్షియం రంధ్రాల్లో పేరుకుపోతోంది. దీంతో నీటి ఒత్తిడిని తట్టుకొని ఊటనీరు బయటకు పోవడానికి ఏర్పాటు చేసిన రంధ్రాలు పూడుకుపోతున్నాయి. దీని వల్ల అంతిమంగా డ్యాంపై ఒత్తిడి పెరిగి జలాశయ గోడలకు పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దాదాపు సగం పోరస్‌హోల్స్ కాల్షియంతో పూడిపోయినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
డ్యాం నిర్మాణ సమయం నుంచి కేవలం కాల్షియంను ఒక్కసారి మాత్రమే సుమారు 2000 సంవత్సరంలో తొలగించినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి ఇంకా ఎగువ నుంచి వరద రాక ప్రారంభం కాలేదు. ఈ సమయంలో కాల్షియం తొలగింపునకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు గోదావరితో పోలిస్తే కృష్ణా నది ప్రవాహ స్వరూపం, ఉప నదులు కలయిక వల్ల నీటిలో ఎక్కువగా కాల్షియం ఉంటుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం.. "పోరస్ హోల్స్‌లో పేరుకుపోయిన కాల్షియంను స్థానిక సిబ్బంది సాయంతో కొద్దికొద్దిగా తొలగిస్తున్నాం. పూర్తిగా తొలగించడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. త్వరలోనే ప్రభుత్వానికి నివేదించి, అక్కడి నుంచి అనుమతులు రాగానే పనులను ప్రారంభిస్తాం."
- ధర్మానాయక్, ఎస్‌ఈ, నీటిపారుదల శాఖ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు
కాల్షియం వల్ల నాగార్జునసాగర్ డ్యాం మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. సాధ్యమైనంత తొందరగా దీనిని తొలగించేలా..... తక్షణం అధికారులు చొరవ తీసుకోవాలని... స్పెషల్ ఇంజినీర్ల పర్యవేక్షణలో ఈ పనులన్నీ వేగవంతంగా జరగాలని నిపుణులు కోరుతున్నారు.