భారీగా జనసమీకరణ
మొదటగా జహీరాబాద్ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న నియోజకవర్గానికి మధ్య ప్రాంతమైన అల్లదుర్గంలో సభను ఏర్పాటు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, తెరాస ఎంపీ బీబీ పాటిల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం నాలుగు గంటలకు సీఎం సభాస్థలికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడం వల్ల తెరాస నేతలు భారీగా జనసమీకరణ చేయనున్నారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 2 లక్షల మంది జనాభాను సమీకరిస్తున్నట్లు తెరాస నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీ దళపతి పర్యటన పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపనుంది.
హరీశ్‌రావు పరిశీలన
జహీరాబాద్ సభ అనంతరం మెదక్ పార్లమెంటు సభలో పాల్గొననున్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా నర్సాపూర్‌లో దీనిని ఏర్పాటు చేశారు. సభా ఏర్పాట్లను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, తెరాస నాయకులు ఉన్నారు.ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ సభ నిర్వహణతో కేసీఆర్ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి :ప్రధాని పదవి కాదు దేశ ప్రజల అభివృద్ధి కావాలి