రాష్ట్రంలో సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని కట్టిన జలాశయం ఇప్పుడు.. కొందరు రైతుల పాలిట శాపంగా మారింది. పంటలు పండించటానికి కావాల్సిన నీళ్లు.. పొలాలను ముంచేస్తున్నాయి. కష్టపడి దున్ని, పెట్టుబడి పెట్టి, పంట సాగు చేస్తే.. తీరా చేతికొచ్చే సమయానికి నీటి పాలవుతోంది. చేనులు కాస్తా చెరువులను తలపిస్తున్నాయి. జలాశయాల బ్యాక్ వాటర్ వల్ల.. చాలా మంది రైతుల పంటలు నీట మునిగి మురిగిపోతున్నాయి.
మూడు సార్లు మునిగినా..
మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, కోటపల్లి, జైపూర్... కుమురం భీం జిల్లాలో బెజ్జూర్ మండలాల్లో పంటలు ఏటా నీట మునుగుతున్నాయి. మూడేళ్లుగా ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిపై నిర్మించిన జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి. ఎల్లంపల్లి జలాశయం గేట్లు ఎత్తివేయడంతో సుందిళ్ల బ్యారేజీ ద్వారా గోదావరిపై ఉన్న అన్నారం బ్యారేజీకి వరద నీళ్లు చేరుతున్నాయి. ఈ మిగులు జలాల వల్ల చెన్నూరు బెజ్జూర్ మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీటమునుగుతున్నాయి. అన్నారం బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో గత నెలలో మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. ఈ సీజన్లో మూడు పర్యాయాలు పంటలు నీట మునిగాయి. అప్పులు తెచ్చి మరీ.. పంటలు వేస్తే.. నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంత నష్టం జరిగినా.. ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా తమని పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన చెందుతున్నారు.
మందు తాగి సచ్చుడే దారి...
"ఈ సీజన్లో మా పంట మునగటం మూడోసారి. మొదటిసారి పత్తివేశాను. చేతికొచ్చే సమయంలో మునిగిపోయింది. అప్పుడు ఎవరూ రాలేదు. రెండో సారి మిరప పంట వేశా. గుంటూరు నుంచి మొక్కలు కొనుక్కొచ్చాం. అప్పుడు కూడా మునిగిపోయింది. ఆ సమయంలోనూ ఎవరూ రాలేదు. ఇప్పుడు కూడా పంటను బ్యాక్ వాటర్ ముంచేసింది. ఇప్పటికీ ఒక్కరు దిక్కులేదు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే.. అంతా నీటిపాలైంది. ఎకరానికి సుమారు 50 వేల రూపాయాల చొప్పున పెట్టుబడి పెడితే.. మూడుసార్లకు ఒక్కొక్కరు సుమారుగా 3 నుంచి 4 లక్షలు నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ వేయాలంటే అప్పు కూడా పుట్టదు. ప్రభుత్వాధికారులు ఒక్కరు వచ్చింది లేదు. సర్వే చేసింది లేదు. స్థానిక రాజకీయ నాయకులైతే ఇటు వైపే చూసుడు లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే.. మందు తాగి సచ్చుడే తప్ప వేరే దారి లేదు." - బాధిత రైతులు.
పంటలు వేయలేని దుస్థితిలో..
మూడేళ్లుగా బెజ్జూర్, చెన్నూరు, జైపూర్, కోటపల్లి మండలాల్లో సుమారు.. 11800 ఎకరాల్లో 8 వేల మంది రైతుల పంటలు నీట మునిగాయి. ఈ ఏడాది మూడుసార్లు మిగులు జలాలు పంటలను నాశనం చేశాయి. రైతులు మూడు సార్లు మళ్లీ పంటలు వేశారు. ఇక మళ్లీ పంటలను వేయలేని దుస్ఠితిలో ఉన్నామని.. కన్నీళ్లు పెట్టుకున్నారు. పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కరకట్టను మరో కిలోమీటరు పొడవు పెంచితే చేన్లకు వరద రాదని రైతులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: