రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు పీజీ, యూజీసీ ఉన్నత విద్యలో ప్రత్యక్ష బోధనకు పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని... ప్రభుత్వ, ప్రైవేటు పీజీ, డిగ్రీ కళాశాలల్లో నుంచి తరగతులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు పది నెలల విరామం తర్వాత ఫిబ్రవరి 1 నుంచి కళాశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి. దీంతో తరగతి గదికి పూర్వ వైభవం రానుంది. ప్రయోగశాలల్లో అనుభవాత్మక బోధన సాగనుంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కళాశాలలు పునఃప్రారంభంకానుండగా... విద్యార్థులకు కొవిడ్ నిబంధనలు అమలు చేయనున్నారు. విద్యార్థుల మధ్య భౌతికదూరం, బేంచీకి ఒక్కరు... లేదంటే ఇద్దరిని మాత్రమే అనుమతించనున్నారు. వసతి గృహాల్లోనూ ఇవే నిబంధనలు అమలు చేయాలని విశ్వవిద్యాలయ అధికారులు నిర్ణయించారు. డిగ్రీలో 5వ సెమిస్టర్, పీజీలో 3వ సెమిస్టర్ విద్యార్థులకే మొదట బోధన పునఃప్రారంభించాలని నిర్ణయించారు. వీరితో పాటు బీఈడీ సెమిస్టర్-3 విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభించనున్నారు.
పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 120 వరకు పీజీ కళాశాలలకు, పీజీ కేంద్రాలు, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలోని వసతిగృహాలు, మెస్‌లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కళాశాల్లోని తరగతి గదుల్లో, వసతి గృహాల్లో, మెస్‌లలో పారిశుద్ధ్యం పనులు వేగవంతం చేశారు. సుమారు ఏడాది నుంచి తగతులకు దూరమయ్యామని... గత సెప్టెంబర్ నుంచి డిజిటల్, ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నా... తమకు అర్థంకావటం లేదని, కొవిడ్ తగ్గుముఖం పట్టడం వల్ల... ప్రభుత్వ నిబంధనల మేరకు కళాశాలలు పునఃప్రారంభించటం సబబేనని విద్యార్థులు, అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.
ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొంటున్నారు. పీజీలోని వివిధ కోర్సుల్లో సుమారు 12 వేల మంది విద్యార్థులుండగా... కొవిడ్ నిబంధనలను అమలు చేసే విధంగా ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలు, వర్శీటీలోని తరగతి గదులను సిద్దం చేస్తున్నట్టు వివరించారు. ఇప్పటికే పారిశ్యుద్ధ్య పనలు ముమ్మరం చేశామని... ఈ నెల 26 వరకు పూర్తి చేయాలని సంబంధిత కళాశాలలకు ఆదేశాలచ్చినట్టు తెలిపారు. ప్రధానంగా ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల నుంచి తప్పనిసరిగా సమ్మతి పత్రాన్ని, కొవిడ్ పరీక్షల రిపోర్టును తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మాస్కు ధరించి కళాశాలలకు రావడంతో పాటు తమ చరవాణిలో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనే నిబంధన విధించారు.
ఇదీ చూడండి: డ్యూటీలో నేరస్థుల వేట.. గ్రౌండ్లో క్రికెట్ ఆట!