కరవు ప్రాంతం, వలసల జిల్లాగా పేరొందిన మహబూబ్నగర్ జిల్లాలో అడవులను విస్తరించేందుకు జిల్లా ప్రజలు ఓ నూతన విధానానికి పూనుకున్నారు. అటవీ సాంద్రతను పెంపొందించడం కోసం 1,14,88,061 విత్తన బంతులు తయారు చేశారు. వారి కృషికి గాను ప్రత్యేక కేటగిరిలో "వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్" లో చోటు సంపాదించారు.
మహిళా సంఘాల సాయంతో...
మహబూబ్నగర్ జిల్లాలో వ్యవసాయంతో పాటు పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు వంటి లక్ష్యాలతో విత్తన బంతుల కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని 284 గ్రామ సమాఖ్యలలో ఉన్న 5,880 స్వయం సహాయక సంఘాలకు చెందిన 69,200 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే 1,14,88,061 విత్తన బంతులను తయారు చేసి అటవీ, బంజరు భూముల్లో చల్లారు.
చింత, సీతాఫలం, జువ్వి, రావి, నల్లతుమ్మ, మర్రి, మేడి, నెమలి నార, వేప విత్తనాలతో బంతులు తయారు చేశారు. ఈ ఏడాది జూన్ 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం జులై వరకు తొమ్మిది రోజుల పాటు జరిగింది.
మంత్రి ప్రశంస..
మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విత్తన బంతుల కార్యక్రమానికి "వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్" దక్కడంపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్ రావు జిల్లా మహిళా సమాఖ్యను, సంబంధిత అధికారులకు, సహకరించిన ప్రజాప్రతినిధులను అభినందించారు.
ఇదీ చూడండి: ఇకపై ఇంటివద్దనే జీవన్ ప్రమాణ్ ధ్రువపత్రం అందజేత