మహబూబ్‌నగర్ జిల్లా యూరోనిపల్లి పంచాయతీ కార్యదర్శి అరుణ్ చంద్ర మృతి చెంది 12 రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు అధికారులను ప్రశ్నించారు. కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? చనిపోవడానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలపై పూర్తిగా దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ సర్పంచ్ భర్త మృతుడిని వేధించినట్లు ఫోన్ సంభాషణ రికార్డ్ చేయడం జరిగిందని.. వాటన్నిటినీ పరిశీలించి ముందుగా సంబంధితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని సూచించారు.
వ్యవస్థలో మార్పులు రావాలని, ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం చేయాలని ఆయన అధికారులను కోరారు. అంతకు ముందు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు, అరుణ్ చంద్ర పని చేస్తున్నటువంటి యారోన్‌పల్లి గ్రామంలో పర్యటించి ఘటనపై విచారించారు. అనంతరం జిల్లా కేంద్రంలో మృతుడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అరుణ్ చంద్ర మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.