Heavy rains in Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రెండు గంటలకు పైగా భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్ద చెరువు కింది ప్రాంతంలో ఉన్న రామయ్యబౌళి, శివశక్తినగర్, బీకే రెడ్డి కాలనీల ఇళ్లలోకి నీరు చేరింది. ఒక్కసారిగా నీరు ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భగీరథకాలనీ నుంచి షాషాబ్‌గుట్టకు వెళ్లే దారి, ట్యాంక్‌బండ్‌కు వెళ్లే దారిలో పెద్ద ఎత్తున నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
వీధులన్ని జలమయం కావడంతో రెండు గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. గతంలో పెద్దచెరువులోకి వచ్చిన వరద నీరు అలుగుల ద్వారా వెళ్తుండేది. ప్రస్తుతం పెద్దచెరువులో పూడికతీత పనులు కొనసాగుతుండటంతో ఆ నీటిని మురుగుకాలువల ద్వారా మళ్లించారు. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో వరదనీరు కాలనీల్లోకి వచ్చి ఇళ్లలోకి నీరు చేరాయి. భారీ వరద ప్రవాహానికి రోడ్లపై ఉన్న వాహనాలు నీటిలో కొట్టుకు పోయాయి. అదనపు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ వెంకటేశ్వర్లు లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బీకేరెడ్డి కాలనీలో ఓ రిటైర్డ్ అధికారి మృతి చెందగా.. ఇంటి చుట్టు నీరు చేరడంతో అంత్యక్రియలకు ఆటంకం ఏర్పడింది.
ఇవీ చదవండి: