కరోనా భయం పట్టణవాసులనే కాదు.. పల్లెప్రజల్ని, రైతుల్ని వెంటాడుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అప్పాయిపల్లికి చెందిన ఓ రైతు సతీసమేతంగా పొలం పనులు చేసుకునేందుకు సొంత వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. పిల్లల్ని ఇంటి వద్దే వదిలేస్తే.. కరోనా ఎక్కడ సోకుతుందో అనే భయంతో.. కూతురు, కుమారుడిని కూడా తమతో పాటు పొలానికి తీసుకువచ్చారు. ఏడో తరగతి చదువుతోన్న హరిణికి ఆన్‌లైన్‌లో తరగతులు జరుగుతున్న నేపథ్యంలో పొలం వద్దే తరగతులు వినేందుకు ఏర్పాటు చేశారు.
ఓ వైపు తల్లితండ్రులు సాగు పనుల్లో నిమగ్నమై ఉంటే... మరోవైపు హరిణి సెల్ ఫోన్లో ఆన్‌లైన్ తరగతులు వింటోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే తరగతులు విని.. సాయంత్రానికి మళ్లీ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్తోంది. కుటుంబానికి ఆదాయం, అన్నం పెట్టే వ్యవసాయ క్షేత్రం హరిణికి బడిగా మారింది. పొలం బడిలో ఆన్‌లైన్ తరగతుల దృశ్యాలు ఈటీవీ భారత్ కెమెరాల్లో నిక్షిప్తం చేసింది.
ఇవీ చూడండి: క్వాసీ జ్యుడిషియల్ సభ్యులకు శిక్షణ ఇవ్వాలి: హైకోర్టు