Diesel prices effect on Farmers: వ్యవసాయం పనులు ప్రారంభం మొదలు.. కోతల వరకు వరిసాగు అధిక శ్రమతో కూడుకున్నది. అయినా అధిక శాతం గ్రామీణ ప్రజలు దీనిమీదే ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న పరిస్థితుల అనుగుణంగా యువత జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లడం.. వివిధ ప్రభుత్వ పథకాల వలన గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత ఏర్పడింది. గత కొద్ది ఏళ్లుగా కూలీల ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. వరి సాగులో కూలీల కొరతను అధిగమించడం సహా ఖర్చును తగ్గించేందుకు యంత్రాలపై ఆధారపడుతున్నారు. పంట పండించేందుకు అయ్యే ఖర్చు తగ్గించి, ఉత్పత్తిని పెంచి అధిక లాభాలు పొందేందుకు ఆధునిక వ్యవసాయ పరికరాలను, యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం నుంచే డీజిల్ ధరలు పెరగడం వల్ల రైతులపై భారం పడుతోంది.
పెరుగుతున్న పెట్టుబడి వ్యయం..
చిన్న, సన్న కారు రైతులు ట్రాక్టర్‌లను అద్దెకు తెచ్చుకొని దుక్కులు దున్నిస్తారు. డీజిల్ ధరల ఆధారంగానే వాటికి అద్దెలు చెల్లిస్తుంటారు. గతేడాది వానాకాలం సీజన్‌లో డీజిల్ ధర లీటరుకు 65 నుంచి 70 రూపాయల మధ్యలో ఉండేది. ప్రస్తుతం వంద రూపాయలకు చేరువలో ఉంది. ఫలితాల యంత్రాల యజమానులు అద్దెలు సైతం పెంచారు. గతేడాది పొలం దుక్కి దున్నేందుకు, దమ్ములు చేసేందుకు ప్రాంతాలను బట్టి ఎకరానికి సుమారు వెయ్యి రూపాయలు తీసుకోగా.. ప్రస్తుతం రూ.1600 వరకు తీసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. వరి కోతలు వచ్చేసరికి పెట్టుబడి భారం మరింత పెరిగుతోందని వాపోతున్నారు.
ఏమీ మిగలడం లేదు..
ఓ వైపు వర్షాలు కమ్ముకొస్తుండటం.. వరి పంట కోతలకు రావటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడితే గింజ నేల రాలిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్, కూలీ రేట్లు, యంత్రాల కిరాయి గణనీయంగా పెరగడం వల్ల పంట సాగు ఖర్చులు అధికమై ఏమీ మిగలడం లేదని వాపోతున్నారు. ఇక వరికోత యంత్రాలు ఉన్నా డిమాండ్ మేరకు వాటి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. వాటికి సైతం గతేడాదితో పోలిస్తే గంటకు 600 నుంచి వెయ్యి రూపాయల వరకు అద్దె ధరలు పెంచడంతో రైతులకు భారంగా మారింది. గతేడాది వరి కోత యంత్రానికి గంటకు 2 వేల నుంచి 2,200 వరకూ తీసుకుంటే... ఈ సీజన్‌లో ప్రాంతాలు బట్టి 2,700 నుంచి 3,300 వరకు వసూలు చేస్తున్నారు. పొలం నుంచి వరి ధాన్యాన్ని గ్రామంలోకి... కొనుగోలు కేంద్రానికి చేర్చేందుకు... కిలోమీటరు దూరం తీసుకెళ్లినా ట్రాక్టర్‌కు 500 నుంచి 700 వరకు వసూలు చేస్తున్నారు. పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎకరా పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలంటే కనీసం 4 వేలు ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు.
డీజిల్ ధరలు పెరగడంతో యంత్రాల అద్దెలు పెంచినట్లు యాజమానులు చెబుతున్నారు. అద్దె ధరలు పెంచకపోతే యంత్రాల నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు. అయినా రైతుల ఆర్థిక ఇబ్బందులు, పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగానే అద్దెలు పెంచినట్టు పేర్కొంటున్నారు.
ఇదీచూడండి: Cabinet meeting: సాగు చట్టాల రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం