Mana Ooru Mana Badi Scheme : ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ ...! బడులు తెరిచేలోగా సరికొత్త రూపు..! ప్రతిచోట నుంచి డజను ప్రతిపాదనలు....ముచ్చటగా మూడింటికి అనుమతులు..! పనులు పూర్తయ్యాకే నిధులు......! జాడలేని పుస్తకాలు, యూనిఫామ్‌లు ..! ఇదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన మన ఊరు-మనబడి పథకం పరిస్థితి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కనీస సౌకర్యాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల దుస్థితి.
Mana Ooru Mana Badi Scheme in Telangana : సర్కారీ బడుల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మనఊరు- మనబడి పథకం ఆదిలోనే చతికిల పడుతోంది. ఈ పథకం కింద బడులు తెరిచేలోగా …12 రకాల పనులు పూర్తి చేయాలి. కానీ, ఇప్పటివరకు ప్రారంభానికే నోచుకోలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 3వేల పాఠశాలలుండగా... తొలివిడతలో వెయ్యి 99 ఎంపిక చేశారు. పనులకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.
విద్యుదీకరణ, మరమ్మతులు, తాగునీటి సౌకర్యం పనులకు మాత్రమే పరిపాలన అనుమతులొచ్చాయి. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పుగండ్ల ప్రాథమిక పాఠశాలలో వంట గది, మూత్రశాలలు లేవు. వంట ఏజెన్సీకి కనీసం వండే పాత్రలు లేవు. పెద్దపూర్ ప్రాథమిక పాఠశాలలోనూ పరిస్థితి ఇంచుమించు అలానే ఉన్నా...పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
పెద్దపూర్ ఉన్నత పాఠశాలలో బాలురకు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా నిర్మించిన 2 గదుల్లో ఫ్లోరింగ్, కిటికీలు పూర్తి కాలేదు. ఫలితంగా అవి వృథాగా పడి ఉన్నాయి. అత్యవసరమైన వాటికి నిధులు ఇవ్వకుండా...కేవలం మూడు పనులకే అనుమతులు ఇవ్వటంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరుగుదొడ్లు, మూత్రశాలలు, కిచెన్ షెడ్లు, ప్రహరీగోడ నిర్మాణాలు ఉపాధిహామీ పథకం కింద చేపట్టాలని నిర్ణయించినా...అడుగు ముందుకు పడలేదు. పనులు ఎవరు ఎప్పడు చేపడతారన్న అంశంపైనా స్పష్టత లేదు. గతంలో అసంపూర్తిగా మిగిలిన పనుల్ని ఉపాధిహామీ పథకం కింద పూర్తి చేస్తామని ఎంపీడీవోలు చెబుతున్నారు. కొత్త సాఫ్ట్ వేర్ లో మూత్రశాలలు, కిచెన్ షెడ్లు, ప్రహారీ గోడల ఐచ్ఛికాలు లేవని వచ్చాక చేపడతామంటున్నారు.
పాఠశాలల్లో కొత్త గదుల నిర్మాణానికి అనుమతులు రాలేదు. సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్ ద్వారా రావాల్సిన ఫర్నీచర్, డిజిటల్ పరికరాలు అందలేదు. ఇక రంగుల ప్రక్రియ ఊసే లేదు. ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడతామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటి వరకూ పుస్తకాలు చేరలేదు. ఏకరూప దుస్తులు సైతం పంపిణీ చేయలేదు. ఇప్పటివరకు కేవలం 30 లక్షల లోపు పనులకు అనుమతులు మంజూరు చేశారు. కానీ, నిధులు మాత్రం ఇవ్వలేదు. పనులన్నీ పూర్తిచేసిన తర్వాతే నిధులు మంజూరు చేస్తామని చెప్పడంతో.... ఎవరూ ముందుకు రావడం లేదు. వీటిని టెండర్ ప్రక్రియ ద్వారా పూర్తి చేయనున్నారు. సెలవు రోజుల్లో చేయాల్సిన పనులు ఇప్పుడు నిర్వహిస్తే... తరగతుల నిర్వహణ ఎలా అని ప్రశ్నిస్తున్నారు.