Bandi Sanjay Comments on KTR : వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని.. త్వరలో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చెప్పారు. ప్రజాసంగ్రామ యాత్ర 26వ రోజు సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్ నుంచి ప్రారంభం కాగా మధ్యాహ్నం మక్తపల్లికి చేరుకుంది. అక్కడ మహిళా రైతులతో ముచ్చటించిన సంజయ్ వారిచ్చిన రాగి అంబలి తాగారు. సాయంత్రం శిబిరం వద్ద.. యాత్ర ముగింపు సభపై వివిధ జిల్లాల భాజపా అధ్యక్షులు, పార్టీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి సభ విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
Bandi Sanjay Praja Sangrama Yatra : యాత్ర ముగింపు సభ మహేశ్వరంలో 5 లక్షల మందితో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొంటారని చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదనే ఆరోపణలను కేసీఆర్ ఆపాలని.. ఆయన ఏం ఒరగబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్‌వన్నీ అబద్ధాలు.. మంత్రి కేటీఆర్ నారాయణపేటలో చెప్పినవన్నీ అబద్ధాలని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం రాత్రి జడ్చర్ల మండలం పెద్దఆదిరాలలో ఆయన గ్రామస్థులతో మాట్లాడారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని కేటీఆర్ చెప్పడం తగదన్నారు. దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రజలను మోసం చేశారు కాబట్టే తాను జనం వద్దకు వచ్చానని సంజయ్ అన్నారు. అనంతరం యాత్ర మహబూబ్‌నగర్ జిల్లా శివారు గ్రామం ఎక్వాయపల్లి వద్దకు చేరుకొంది.
గిరిజనుల్ని మోసం చేస్తున్న కేసీఆర్ : ఆదివాసీ గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు, పోడు భూములకు పట్టాల విషయంలో సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని భాజపా విమర్శించింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 18న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపడతామని తెలిపింది. అనంతరం జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లో దీక్షలు నిర్వహిస్తామని, ముఖ్యమంత్రి ఫాంహౌస్‌ను ముట్టడిస్తామని పేర్కొంది.
‘రాష్ట్రంలో గిరిజనులు 9.8 శాతం మంది ఉన్నారు. 12 శాతం రిజర్వేషన్‌పై అసెంబ్లీలో బిల్లు ఎలా ఆమోదించారో కేసీఆర్ చెప్పాలి. 14న తుక్కుగూడలో జరిగే అమిత్‌షా సభకు గిరిజనులు పెద్దసంఖ్యలో తరలిరావాలి. ఎస్టీ రిజర్వేషన్లు తేలకముందే ఉద్యోగ నోటిఫికేషన్లతో గిరిజన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టం కలిగిస్తోంది.' అని ఎంపీ సోయం బాపూరావు విమర్శించారు.