తెలంగాణలో కొత్త పార్టీ స్థాపనకు సిద్ధమైన వైఎస్ షర్మిల శుక్రవారం ఖమ్మంలో తలపెట్టిన సంకల్ప సభలో దాని విధివిధానాలను వెల్లడించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మంలోని పెవిలియన్ మైదానంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో తల్లి విజయమ్మతో కలిసి పాల్గొననున్నారు. ఇది షర్మిల తొలి బహిరంగ సభ కావటంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్రను ప్రారంభించింది ఏప్రిల్ తొమ్మిది కావడంతో అదే తేదీని ఆమె ఎంచుకున్నారు. పార్టీ ఎజెండా, దిశ, దశలపై బహిరంగ సభలో స్పష్టత ఇవ్వనున్నట్లు గతంలోనే ఆమె ప్రకటించారు.
ఎనిమిది ప్రాంతాల్లో భారీ స్వాగత ఏర్పాట్లు
షర్మిలకు స్వాగతం పలికేందుకు దారి పొడవునా ఏర్పాట్లు చేశారు. ఆమె హైదరాబాద్ నుంచి భారీ వాహన శ్రేణితో బయల్దేరనున్నారు. హైదరాబాద్ పరిసర జిల్లాల ముఖ్య నాయకులతో కలిసి ఆమె లోటస్ పాండ్ నుంచి ఉదయం ఏడు గంటలకు ప్రయాణమవుతారు. నగరంతోపాటు చౌటుప్పల్, నార్కెట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేటతోపాటు ఎనిమిది ప్రాంతాల్లో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం భోజనం సూర్యాపేటలో చేస్తారు. కూసుమంచి నుంచి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆమెకు స్వాగతం చెప్పనున్నారు. సాయంత్రం ఖమ్మంలో భారీ ర్యాలీ ద్వారా బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు.
తెలంగాణలో రాజన్న సంక్షేమ రాజ్యం ఏర్పాటు అవసరం ఉందని, కొత్త పార్టీని స్థాపిస్తామని సరిగ్గా అరవై రోజుల కిందట ఫిబ్రవరి 9న షర్మిల ప్రకటించారు. తొలిసారి చేవెళ్ల, నల్గొండ జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులు, వైకాపా కార్యకర్తలు, నాయకులతో లోటస్‌పాండ్‌లో సమావేశం నిర్వహించారు. అనంతరం ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నాయకులు, మద్దతుదారులతో సమావేశాలు నిర్వహిస్తూ మధ్యమధ్యలో సామాజిక వర్గాలు, వివిధ రంగాల వారిని కలిశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో సంఘీభావం ప్రకటిస్తున్న వారిలో ముగ్గురు నుంచి ఐదుగురు నాయకులను గుర్తించి అడహాక్ కమిటీలను సిద్ధం చేశారు. కాంగ్రెస్, భాజపాలకు చెందిన పలువురు నాయకులు, జిల్లాల నుంచి కొందరు సర్పంచులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి ఆమెకు మద్దతుగా నిలిచారు. పలు పార్టీల నుంచి వచ్చిన విమర్శలు, రాజకీయ ఆరోపణలపై ఖమ్మం సభావేదిక నుంచే స్పష్టత ఇస్తామని ఆమె పలుమార్లు ప్రకటించారు.
పెద్ద ఎత్తున తరలివచ్చే పరిస్థితులు: కొండా రాఘవరెడ్డి
షర్మిల పెట్టబోయే పార్టీ పొత్తుల పార్టీ కాదని, ఎవరికీ తోక పార్టీ కాదని ఆమె ముఖ్య అనుచరుడు కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. ఆమె తెలంగాణ ప్రజలు వదిలిన బాణమన్నారు. ఈ సభలో పార్టీ పేరును ప్రకటించకపోవచ్చని అన్నారు.
ఇవీ చూడండి: నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని ఎస్ఈసీ ఆదేశం