TRS Representatives Goa Trip: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం క్రాస్ ఓటింగ్‌కు చెక్ పెట్టేందుకు అధికార తెరాస క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. తెరాసకు చెందిన ప్రజాప్రతినిధులపై ప్రత్యర్థుల ప్రభావం లేకుండా చూస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని 45 మంది తెరాస ప్రజాప్రతినిధులు నవంబర్ 30న గోవా పర్యటనకు వెళ్లారు. గత వారం రోజుల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలు గోవాలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు.
గోవా నుంచి నేరుగా ఈనెల 10న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు రానున్నారు. ఓట్లు ఎలా వేయాలి.. క్రాస్ ఓటింగ్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధుల భర్తలకు కూడా అవకాశం ఇచ్చారు. వివిధ ప్రాంతాల్లో దిగిన ఫొటోలు, వీడియోలను ప్రజాప్రతినిధులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
![trs local representatives goa trip](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13835874_trs-goa3.jpg)
కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు సైతం గోవాకు వెళ్లారు. అక్కడ రిసార్టులో తెరాస పార్టీ పాటలకు డ్యాన్స్‌లు వేస్తున్నారు. ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీనిపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు వీటిని సమర్థిస్తుంటే.. మరికొందరు ప్రజాసమస్యలను పక్కన పెట్టి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
![trs local representatives goa trip](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13835874_trs-goa.jpg)
ఇదీచూడండి: TRS Camp Politics: క్రాస్ ఓటింగ్ భయం.. తెరాస క్యాంపు రాజకీయం!