Telangana National Unity Vajrotsavam: రాష్ట్రంలో జాతీయ సమైక్యతా ఉత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. హనుమకొండ జిల్లా పరకాలలో వేడుకలకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. నిజాం నిరంకుశ పాలనలో అమరులైన అమరవీరులను స్మరించుకున్నారు. హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి భారీగా జనం హాజరయ్యారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండా పట్టుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. కోలాటాలు బతుకమ్మలు ఆడుతూ మహిళల సందడి చేశారు. ర్యాలీలో 17 అడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నిధులు తేకుండా.. విద్వేషాలు రెచ్చగొట్టి వెళ్తున్నారు.. రాష్ట్రం సిద్ధించాక సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో అమరవీరుల స్థూపం నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఎనిమిదేళ్లు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో భాజపా చిచ్చుపెట్టే యత్నం చేస్తోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిలలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని.. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వరుసగా రాష్ట్రానికి వస్తున్న కేంద్రమంత్రులు నిధులు తేకుండా.. విద్వేషాలు రెచ్చగొట్టి వెళ్తున్నారని ధ్వజమెత్తారు.
ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వచ్చి పనిచేస్తున్నారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో... ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో ర్యాలీని మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. జడ్పీ సెంటర్ నుంచి సర్దార్ పటేల్ మైదానం వరకు ప్రదర్శన నిర్వహించారు. సిద్ధిపేటలో జరిగిన వేడుకలకు మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఒకప్పుడు తెలంగాణ నుంచి వలసలు వెళ్లగా... ఇప్పుడు ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వచ్చి పనిచేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ సారధ్యంలో తెలంగాణను దేశ ధాన్యాగారంగా మార్చామని వివరించారు.
కనీసం తాగేందుకు నీళ్లు ఉండేవి కావు.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్సవాలకు సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వివక్షకు గురైందని ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ర్యాలీలో పాల్గొన్నా ఆయన... ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు జీవ నదులు ఉన్నా.. కనీసం తాగేందుకు నీళ్లు ఉండేవి కావన్నారు. మెదక్ మున్సిపాల్టి నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వరకు నిర్వహించిన భారీ ర్యాలీని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నృత్యం చేసి ఎమ్మెల్యే అలరించారు.
విద్యార్థులపై పడిన ఎల్ఈడీ స్క్రీన్లు.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే నలమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మండలి చైర్మన్ గుత్తాసుందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి నేతలు ప్రసంగిస్తుండగా.. సభలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లు విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు ఐదుగురికి గాయాలయ్యాయి. మంచిర్యాలలో ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు... ఎండతీవ్రతకు 30 మంది స్పృహకోల్పోయి కిందపడిపోయారు. వారిని 108 వాహనం ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి: