ఏన్కూరు మండలం తిమ్మరావుపేటకు చెందిన మోతుకూరి నారాయణరావు.. వివేకనందుడి స్ఫూర్తితో తన వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సొంతూరులో విద్యాభ్యాసం పూర్తయి ఖమ్మంలో స్థిరపడ్డారు. పేదలకు అండగా ఉండాలనే లక్ష్యంతో స్నేహితులతో కలిసి సేవాభారతి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాలతో పాటు మొక్కల పెంపకంపై కూడా దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా ఏన్కూరు లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణాన్ని మొక్కలతో హరితవనంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు.
వేల రూపాయలు వెచ్చించి ..
అందులో భాగంగానే యానం, ఏపీలోని రాజమండ్రి ప్రాంతాల నుంచి వేల రూపాయలు వెచ్చించి పండ్లు, పూల మొక్కలు తెప్పించారు. ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకంగా కూడా ఏన్కూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రెండేళ్ల క్రితం నాచారం కొండపైన, ఘాట్రోడ్కు ఇరువైపులా మొక్కలు నాటారు.
పూల పరిమళాలు..
నాడు నాటిన మొక్కలు నేడు పూల పరిమళాలు వెదజల్లుతున్నాయి. స్వామి పూజకు సైతం బయట నుంచి పుష్పాలను కొనుగోలు చేసే అవసరం లేకుండా వీటినే వినియోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, సేవా కార్యక్రమాలతో జిల్లాలో గుర్తింపు పొందుతూ.. సొంతూరు ప్రజలతో పాటు, అధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు సేవాభారతి ట్రస్ట్ సభ్యులు.
ఇవీ చూడండి: ఉమ్మడి ఖమ్మంలో నరకప్రాయంగా రహదారులు