ఖమ్మం నగరం(khammam town)లోని మోతీనగర్ కాల్వొడ్డులో హజ్రత్ సోందే షహీద్ రహ్మతుల్లా(Dargah Hazrat Meethe Shaheed rahmathulla) దర్గాకు 11 ఎకరాలు భూమి ఉంది. సర్వే నెంబర్ 86, 87, 88 సర్వే నెంబర్లలో ఉన్న ఈ స్థలంలో ఖబరిస్థాన్‌కు 4 ఎకరాల భూమి ఉంది. ఇంకా మిగిలింది, ఏడు ఎకరాలు. ఈ ఏడు ఎకరాల భూమి ఆక్రమణల చెరలో చిక్కింది. కబ్జాపై 2010లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా దాని ఆదేశానుసారం అప్పటి ఖమ్మం అర్బన్ తహసీల్దార్ ఆధ్వర్యంలో విచారణ చేశారు. ఈ భూమిలో మొత్తం 87 మంది ఆక్రమణదారలు ఉన్నట్లు తేల్చారు. ఆక్రమణదారులకు చెందిన నల్లా కనెక్షన్లు, విద్యుత్ మీటరు, పంపు సెట్లకు ఉన్న విద్యుత్ మీటర్లు డ్రైనేజీ వ్యవస్థను ప్రాథమికంగా సీజ్ చేశారు.
నివేదిక సైతం తుంగలో తొక్కారు..
అనంతరం ఆక్రమణదారులు మోతీనగర్ వెల్ఫేర్ సొసైటీగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. వీరి ద్వారా వక్ఫ్ బోర్డుకు తమ సమస్యను నివేదించారు. ఇక్కడి భూమికి బదులు ప్రత్యామ్నాయ భూమి ఇచ్చి ప్రస్తుతం ఉంటున్న స్థలాలను క్రమబద్దీకరించాలని అప్పటి మంత్రులు, ప్రజాప్రతినిధుల ద్వారా అభ్యర్థించారు. ఇలా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఐదేళ్ల పాటు విచారణ జరిగింది. విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2014 నుంచి 2016 వరకు విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు తేల్చారు. అక్రమాలకు పాల్పడిన వారి నుంచి 2018 నాటికి మొత్తం రూ.68 లక్షలు రికవరీ చేయాలని అదేవిధంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చారు. అన్యాక్రాంతం అవుతున్న భూమి విషయంలో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ నివేదిక సైతం తుంగలో తొక్కారు. గతంలో కంటే భూమి విలువ ఎన్నో రెట్లు పెరిగింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ భూములపై పడుతోంది. ఇక్కడ మిగిలిన భూమి ఏటా కొంత చొప్పున కబ్జాకు గురవుతోంది. అంతా చోద్యం చూస్తున్నారే తప్పితే చర్యలు మాత్రం తీసుకోవటం లేదు.
యాక్షన్ తీసుకుంటాం..
మేం సర్వేకు పోయినాం అక్కడ ఇన్స్పెక్షన్ గురించి నేను మా స్టాఫ్ అండ్ డీఎండబ్ల్యూఓ గారితో. అక్కడున్న మొత్తం షాపులు వాటికి వస్తున్న రెంట్లు.. లీజ్‌కు ఇచ్చారా? సబ్ లీజ్‌కు ఇచ్చారా అని అడిగితే.. వాళ్లు రెండ్రోజులు టైం అడిగారు. రిమైనింగ్ ఎన్‌క్రోజ్‌మెంట్ అనేది మేము సర్వేకి రాసినాం. జాయింట్ సర్వే అయితే ఆ ప్రకారం మేము 100% యాక్షన్ తీసుకుంటాం. ఫయాజ్, వక్ఫ్ ఇన్స్ పెక్టర్, ఖమ్మం జిల్లా
అన్యాక్రాంతం కాక తప్పదు!
దర్గాకు చెందిన కొన్ని ఓపెన్ ప్లాట్లను కొంతమంది అగ్రిమెంట్ పేపర్లలో 50 గజాల మాత్రమే లీజుకు తీసుకున్నామని చెప్పి ఒక్కొక్కరు 400, 800, 1000 గజాల వరకు దర్గా భూములను ఆక్రమించుకున్నారు. మొత్తం 65 దుకాణాలు ఉండగా అవి కూడా చేతులు మారుతున్నాయి. ఇప్పటికైనా వక్ఫ్ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటేనే దర్గా భూములు కాపాడే అవకాశం ఉంది. లేకపోతే ఉన్న భూములన్నీ అన్యాక్రాంతం కాక తప్పదు.
ఇవీ చూడండి: NSP LANDS: ఎన్నెస్పీ భూముల్లో జోరుగా ఆక్రమణల పర్వం