రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని.. తమ వంతు బాధ్యతగా బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని ఎంపీ నామ నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి జీప్(అమ్మ ఆరోగ్య రథం)ను నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు.
ఈ నెలలో ఆరు అంబులెన్స్‌లు:
గత నెల 22వ తేదీన తెరాస లోక్‌సభపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు... అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పలు గ్రామాలు పర్యటించిన విషయం విధితమే. నామ పర్యటనలో పలు సమస్యలపైన స్థానిక ప్రజలు వినతి పత్రాలు అందజేశారు. అందులో భాగంగా అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డా.నీలిమ.. కొవిడ్ టెస్టుల కోసం మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని నామ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన ఎంపీ 'అమ్మ ఆరోగ్య రథం'ను నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇవాళ అందించారు.
ఈ వాహనం నెల రోజుల పాటు కొవిడ్ టెస్టులకు అశ్వారావుపేట పీహెచ్ వైద్య సిబ్బందికి అందుబాటులో ఉంటుందని ఎంపీ తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు తనవంతుగా ఆరు అంబులెన్స్‌లను కొనుగోలుకు చెక్‌ను సంబంధిత సంస్థకు అందజేసిన విషయం విధితమే. ఈ నెలలో ఆరు అంబులెన్స్‌లు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటుగా తెరాస మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, ఎంపీపీ, జడ్పీటీసీలతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఈనెల 13 తర్వాత ఎప్పుడైనా జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ : ఎస్ఈసీ