రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సంకల్పిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. క్రీడల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తుందన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు చేశారు. ఖమ్మంలో హరిత టూరిజం భవన్, బీసీ భవన్‌కు శంకుస్థాపన చేశారు.
సర్ధార్ పటేల్ మైదానంలో క్రికెట్ ట్రోఫీ, సింథటిక్ స్కేటింగ్ ప్రారంభించారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలి ఆరేళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ రంగాలపై దృష్టి సారించి అన్నివర్గాల్లో వెలుగులు నింపారన్నారు. తెలంగాణను పర్యాటక హబ్‌గా చేసేందుకు పనిచేస్తున్నామన్నారు.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై రూ.10 కోట్ల విలువైన స్థలంలో రూ. 8 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం అర్బన్ మండలం రామన్నపేటలో 5 ఎకారాల్లో ఏర్పాటు చేసిన తాటివనం, ఈతవనంను మంత్రులు ప్రారంభించారు. అక్కడ తాటి, ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రులు నీరా రుచి చూశారు. ప్రజాప్రతినిధులు, అధికారులంతా నీరా రుచి చూసి బాగుందంటూ మాట్లాడుకున్నారు.