Grain collection in khammam: ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంతో... ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యాసంగి సీజన్‌లో వరి సాగు గణనీయంగా తగ్గింది. ఖమ్మం జిల్లాలో లక్షా 5 వేల 274 ఎకరాల్లో వరి సాగుచేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో వరి పండించారు. రెండు జిల్లాల్లో వరిపైరు వివిధ దశల్లో ఉంది. కొన్నిచోట్ల పొట్ట దశలో మరికొన్ని చోట్ల గింజకట్టు దశలో ఉంది. సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో వరి కోతలు ముందే ప్రారంభం అయ్యాయి. రెండు మూడు రోజుల్లో సత్తుపల్లి ప్రాంతంలో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం తర్వాత ఉమ్మడి జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగనున్నాయి. మరికొన్ని రోజుల్లో పంట చేతికి రానుండటంతో.. వరి సాగుదారులకు ఇప్పటి నుంచే బెంగ పట్టుకుంది. యాసంగిలో ధాన్యం సేకరణ అంశంపై... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాటల యుద్ధం సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అన్నదాతలను కలవరపడుతున్నాయి.
రైతుల్లో దిగులు..: ధాన్యం చేతికి వస్తే ఎలా అమ్ముకోవాలన్న దిగులు రైతులకు పట్టుకుంది. ప్రైవేటు వ్యాపారులకు అమ్మితే అనేక కొర్రీలు పెట్టి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారన్న ఆందోళన వెంటాడుతుంది. పంట విక్రయించిన తర్వాత సకాలంలో డబ్బులు చేతికి అందుతాయన్న నమ్మకం లేదు. గడిచిన సీజన్‌లోనూ రైతులు దళారీ వ్యాపారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి జిల్లాలో రైతులు పండించిన ధాన్యంలో.. సగం ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేశారు. ఇలా అనేక కష్టాలు, నష్టాలు అన్నదాతలకు తప్పేలా లేవు. అందుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని... రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోళ్లపై ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానేసి.. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీచూడండి: Paddy Procurement: ధాన్యం కొనడమా?.. కొనిపించడమా..?