రాష్ట్రంలో ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని..జిల్లాలకు విస్తరించే లక్ష్యంతో ఐటీ హబ్‌లకు సర్కారు శ్రీకారం చుట్టింది. యువతకు ఉపాధి, గ్రామీణ ప్రాంతాలకు సాంకేతిక ఫలాల విస్తరణ లక్ష్యంగా వీటి నిర్మాణం చేపట్టింది. వరంగల్, కరీంనగర్‌లో ఐటీ హబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ప్రత్యేక చొరవ చూపి కేటీఆర్‌ను ఒప్పించి ఖమ్మంలో ఐటీ హబ్‌కు ఆమోదముద్ర వేయించారు. 2017లో ఐటీ మంత్రి కేటీఆర్ ఖమ్మం నడిబొడ్డున విశాలమైన ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. తొలుత 12 కోట్ల 50 లక్షలతో 25 వేల చదరపు అడుగుల వైశాల్యంలో భవన నిర్మాణం ఆరంభించారు. ఆ తర్వాత భవనం ఆరు అంతస్తులకు విస్తరించారు. మొత్తం 42 చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించారు. ఇందుకోసం మరో 12న్నర కోట్ల నిధులు కేటాయించారు. కొంత ఆలస్యమైనా... ఎట్టకేలకు తొలిదశ ఐటీ హబ్ నిర్మాణం పూర్తై అందుబాటులోకి రాబోతుంది.
ఖమ్మం ఐటీ హబ్‌లో ఆరు సాఫ్ట్‌వేర్ సంస్థల ఏర్పాటుకు అవకాశం ఉంది. ఒక్కో కంపెనీలో 100 మంది చొప్పున 600 మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇక్కడే నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేసి సాఫ్ట్‌వేర్ రంగంలో మెలుకువలపై అవగాహన కల్పించనున్నారు. ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ జాబ్ మేళా ద్వారా నిర్వహించగా... దాదాపు 2 వేల మంది యువత హాజరయ్యారు.
ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు, పుణె నగరాలకే పరిమితమైన ఐటీ రంగం ఖమ్మం జిల్లాకు విస్తరించడం పట్ల యువత సంతోషం వ్యక్తం చేస్తోంది. సొంత జిల్లాలోనే ఉపాధి లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఐటీహబ్ రెండో దశ నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి: డీఆర్సీ కేంద్రాల్లో సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ