Godavari heavy flow in Bhadrachalam: రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద సోమవారం ఉదయం 11 గంటలకు 41 అడుగులకు చేరిన నీటిమట్టం అర్ధరాత్రి 12 గంటలకు 48 అడుగులకు పెరగడంతో కలెక్టర్ అనుదీప్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో మళ్లీ భద్రాద్రి వద్ద నీటిమట్టం భారీగా పెరుగుతూ ఈ రోజు ఉదయం 7 గంటలకు 50 అడుగులకు చేరింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో 12,51,999 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.
భద్రాద్రి ఆలయ స్నానఘట్టాలు చాలావరకు మునిగాయి. తలనీలాలను సమర్పించే కల్యాణకట్ట దిగువకు నీరు చేరింది. ఈ నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు సహా ఇతర జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలివ్వాలని సూచించారు. మరోవైపు మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా లోకేశ్వరం(నిర్మల్ జిల్లా)లో 3.2, గుండుమాల్ (నారాయణపేట)లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం రాత్రి అత్యధికంగా లక్ష్మణచాందా(నిర్మల్)లో 14.3, పొచ్చెర(ఆదిలాబాద్)లో 12.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం వాతావరణం చల్లగా ఉంది.
మేడిగడ్డ నుంచి 9.34 లక్షల క్యూసెక్కులు దిగువకు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి భద్రాచలం వరకు నీటిప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఎస్సారెస్పీ నుంచి దిగువకు 2.08 లక్షల క్యూసెక్కులు విడుదలవుతుండగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చేసరికి ఇన్‌ఫ్లో 5.91 లక్షల క్యూసెక్కులు నమోదవుతోంది. ఇక్కడి నుంచి 6.69 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ వద్ద 10.43 లక్షల క్యూసెక్కులు నమోదవుతుండగా 85 గేట్లు ఎత్తి అంతే నీటిని విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద సోమవారం రాత్రి 9 గంటలకు నీటిమట్టం 48.21 అడుగులకు చేరింది. మరోవైపు కృష్ణా పరీవాహకంలోని ఎగువ ప్రాజెక్టులైన ఆలమట్టికి వరద పెరిగింది. నారాయణపూర్ నుంచి నీటి విడుదలను క్రమంగా పెంచుతున్నట్లు డ్యాం ఇంజినీర్లు దిగువ ప్రాంతాల ప్రజలను, ప్రాజెక్టుల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జూరాలకు 2 లక్షలకు పైగా ప్రవాహం చేరుతోంది. దీంతో ఇక్కడి నుంచి 2.20 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం జలాయానికి 2.95 లక్షల క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 9 గేట్లు ఎత్తి 3.11 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 2.77 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 16 గేట్లు ఎత్తి నీటిని 2.37 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఇవీ చదవండి: