ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులను వరుణుడు ఊరిస్తున్నాడు. రాష్ట్రంలో జూన్ 4న రుతుపవనాలు ప్రవేశించగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ సీజన్‌లో జూన్ రెండో వారంలో తొలకరి పలకరించింది. సీజన్ ప్రారంభమైన తర్వాత అడపాదడపా వర్షం కురిసింది. తొలకరి పలకరింపుతో.. ఉభయ జిల్లాల రైతులు మురిసిపోయారు. భూములు చదును చేసుకోవడం, దుక్కులు దున్నుకోవడం, విత్తనాలు సిద్ధం చేసుకోవడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. తీరా విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యేనాటికి వరుణుడు ముఖం చాటేశాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 10 రోజులుగా వర్షం జాడలేదు. అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసినప్పటికీ పెద్ద వర్షం జాడలేకపోవడంతో అన్నదాతలకు నిరీక్షణ తప్పడం లేదు. ఉభయ జిల్లాల్లో వర్షపాతం పరంగా చూస్తే.. ఖమ్మం జిల్లాలో ఆశాజనకంగానే నమోదైనప్పటికీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం తక్కువ వర్షపాతం నమోదైంది. విత్తనాలు విత్తుకునేందుకు భూములు సిద్ధం చేసుకున్న రైతులు... వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో వానాకాలం సీజన్‌లో మొత్తం 5 లక్షల 96 వేల 149 ఎకరాల్లో పంటల సాగు లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ నిర్దేశించుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అన్ని పంటలు కలుపుకుని 40 వేల 561 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. 6.80 శాతం పంటల సాగయ్యాయి. వరి సాగు లక్ష్యంగా 2 లక్షల 52 వేల 500 ఎకరాలు కాగా.. పత్తి సాగు విస్తీర్ణం 2 లక్షల 70వేల ఎకరాలు ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వానాకాం సీజన్‌లో మొత్తం పంటల సాగు లక్ష్యం 4 లక్షల 61 వేల 850 ఎకరాలు ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 5000 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ఈసారి జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం 2 లక్షల 55 వేల ఎకరాలు.. వరి లక్షా 39వేల 300 ఎకరాల్లో సాగు లక్ష్యం ఉంది. 16 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేసేందుకు సమాయత్తమయ్యారు. మోస్తరు నుంచి భారీ వర్షం కురిస్తే రైతులంతా విత్తనాలు వేసే ప్రక్రియలో నిమగ్నం కానున్నారు. ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు... రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో ఉభయ జిల్లాల్లో అన్నదాతలు మురిసిపోతున్నారు.
మరోవైపు ప్రస్తుత వానాకాలం సీజన్ కోసం.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విత్తనాలు వేసుకునేందుకు చాలా సమయం ఉందని రైతులు కంగారుపడాల్సిన అవసరం లేదంటున్నారు.