Chandrababu: గోదావరి వరదలతో సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న వరద బాధితులను ప్రభుత్వాలే అన్ని విధాలా ఆదుకోవాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. వరద బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఉండే పార్టీ తెలుగుదేశమని ఆయన స్పష్టం చేశారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో నిరంతరాయంగా పర్యటిస్తున్న చంద్రబాబు.. ఏపీ పర్యటన ముగించుకొని రాష్ట్రంలోకి ప్రవేశించారు. బూర్గంపాడు, సారపాకలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆయన పరామర్శించారు. తెలంగాణ సరిహద్దు వద్ద చంద్రబాబుకు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాత్రి భద్రాచలంలో ఆయన బస చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని వరద ముంపు బాధితుల్ని చంద్రబాబు పరామర్శించారు.
'20 ఏళ్ల క్రితం గోదావరి కరకట్ట నిర్మించాం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పనులు చేశాం. 1986లోనూ వరదలు వస్తే భద్రాచలం ముంపునకు గురైంది. మనం చేసిన అభివృద్ధి శాశ్వతంగా ఉంటుంది. భవిష్యత్తులో విపత్తు లేకుండా పనులు చేపట్టాల్సి ఉంది. కరకట్ట నిర్మించి శాశ్వత పరిష్కారం జరిగే వరకు పోరాడతాం.'-చంద్రబాబునాయుడు, తెదేపా అధినేత
అంతకు ముందు చంద్రబాబు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయం వద్ద తెదేపా అధినేతకు ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబుకు... ఉపాలయంలో వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం, శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు. చంద్రబాబుతో పాటు తెదేపా నేతలు చినరాజప్ప, దేవినేని ఉమ రామయ్యను దర్శించుకున్నారు. అనంతరం, ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు... గోదావరి కరకట్టను పరిశీలించారు.
యువత భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణలోనూ తెలుగుదేశం ఉండాల్సిన అవసరముందన్నారు. ఖమ్మంతో తెలుగుదేశం పార్టీకి విడదీయరాని బంధం ఉందన్న బాబు... తెదేపాకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోటని గుర్తుచేశారు. ఇక్కడి వారిని చూస్తుంటే తెలంగాణతో పాత అనుభవాలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. దూరదృష్టితో 2000 సంవత్సరంలో తెదేపా సర్కార్ భద్రాచలంలో చేపట్టిన కరకట్టల నిర్మాణం... ఇప్పుడు అందరినీ కాపాడిందని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి వరదలొచ్చినప్పుడు ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సుదీర్ఘ కాలం తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చంద్రబాబు రావడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
ఇవీ చదవండి: