BJP Protest in Telangana: రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు సహా తెరాస నాయకుల ఆగడాలు అడ్డుకోవడమే లక్ష్యంగా... నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు భాజపా పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో నల్లజెండాలు చేతపట్టి భాజపా శ్రేణులు నిరసన ర్యాలీలు చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న సంజయ్ పాదయాత్ర శిబిరం వద్దే నిరసన దీక్షలో పాల్గొననున్నారు.
ఖమ్మంలో భాజపా అనుబంధ మజ్దూర్ యూనియన్ జిల్లా కన్వీనర్ సామినేని సాయిగణేశ్ ఆత్మహత్య తర్వాత పరిస్థితులు రాజకీయ రగడకు దారితీస్తున్నాయి.సాయి గణేశ్ మృతికి అధికార పార్టీ నేతలతోపాటు పోలీసులే కారణమంటూ భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. మృతుడి అమ్మమ్మ స్వయంగా కమిషనరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నిన్న సాయిగణేశ్ కుటుంబాన్ని... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్‌లో పరామర్శించారు. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సాయిగణేశ్ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. ఈ మెుత్తం వ్యవహారంపై భాజపా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే ఎలాంటి విచారణైనా జరుపుకోవచ్చంటూ తెరాస స్పష్టచేసింది.
అధికార పార్టీ ఆగడాల్ని వివరించడంతోపాటు సాయిగణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణజరిపించాలని డిమాండ్ చేస్తూ భాజపా నేతలు గవర్నర్ తమిళసైని కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు.
అసలు ఏం జరిగిందంటే..: ఖమ్మం భాజపాలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సాయిగణేశ్ అనే కార్యకర్త.... ఈ నెల 14న పోలీస్‌స్టేషన్ ఆవరణలో పురుగులమందు తాగాడు. తొలుత అతణ్ని ఖమ్మం ఆస్పత్రికి తరలించగా... మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. రెండ్రోజుల పాటు చికిత్స పొందినా.. సాయిగణేశ్ పరిస్థితి మెరుగవ్వకపోగా ఇంకా విషమించింది. చికిత్స పొందుతూనే సాయిగణేశ్ ప్రాణాలు విడిచాడు.
వచ్చే నెల 4న పెళ్లి జరగాల్సి ఉండగా..: సాయిగణేష్ మృతితో భాజపా శ్రేణులు ఖమ్మంలో ఆందోళనకు దిగారు. తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయిగణేశ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. సాయిగణేష్‌ను పోలీసులు, అధికార పార్టీ నేతలు తీవ్రంగా వేధించారని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆరోపించారు. సాయిగణేశ్‌కు.. వచ్చే నెల 4న వివాహం జరగాల్సి ఉండగా... ఇంతలోనే ఈ ఘోరం జరిపిపోయిందంటూ... కన్నీటి పర్యంతమ్యయారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని భాజపా నేతలు ఆరోపించారు.
ఇదీ చదవండి:భాజపా కార్యకర్త ఆత్మహత్య.. ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు.. తెరాస వేధింపులే కారణమా.?