ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న దళిత బంధు పథకంపై ఆదిలోనే పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీఎం తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో 76 మందికి రూ.10 లక్షల చొప్పున దళిత బంధు నగదును అందించారు. పైలెట్ ప్రాజెక్టు కింద కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. దళిత బంధును ఈనెల 16న లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ పథకంలో కొద్దిమందికే చోటు కల్పిస్తున్నారంటూ పలు చోట్ల ఎస్సీలు ఆందోళన చేస్తున్నారు.
దళిత బంధులో తమకు అన్యాయం జరిగిందంటూ హుజూరాబాద్ నియోజకవర్గంలో పలుగ్రామాల ప్రజలు ఆందోళనకు దిగడం వల్ల ఉద్రిక్తత నెలకొంది. దళితులందరికి పథకం అందజేస్తామని చెప్పినా.. కొంతమందినే ఎంపిక చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పలుచోట్ల ఆందోళన చేశారు.
పెద్దపాపయ్యపల్లిలో 175 కుటుంబాలు ఉండగా కేవలం 21 మందిని మాత్రమే ఎంపికచేశారంటూ పర్కాల క్రాస్ రోడ్డు వద్ద గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మరోవైపు కందుగులలో 250 కుటుంబాలు ఉండగా ఎనిమిది మందినే ఎంపిక చేశారని హుజూరాబాద్-పరకాల రోడ్డులో రాస్తారోకో చేపట్టారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్‌లో 70 కుంటుంబాలు ఉండగా కేవలం నలుగురిని మాత్రమే ఎంపిక చేశారని అంబేడ్కర్ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. దీనితో కరీంనగర్-హుజూరాబాద్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అర్హులైన ఎస్సీలకు పథకాన్ని అమలు చేయాలని వారు నినాదాలు చేశారు. పోలీసులు రంగంలో దిగి ఆందోళనకారులతో మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదని కలెక్టర్ స్వయంగా చెబుతున్నారు కదా అని నచ్చజెప్పే యత్నం చేశారు. ఎవరికి అన్యాయం జరగదని అందరికీ పథకం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పి.. ఆందోళనలు విరమింప చేశారు.
శుక్రవారం ఏం జరిగిందంటే..
హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో కేవలం 8 మందినే దళిత బంధు పథకం కింద ఎంపిక చేయడంపై మిగిలిన వారు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం.. లబ్ధిదారుల జాబితాతో దళితవాడకు వచ్చిన అధికారి నుంచి జాబితాను లాక్కొని చింపివేశారు. గ్రామంలో 150 మంది వరకు ఎస్సీలు ఉండగా కేవలం 8 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించడమేమిటని.. నిలదీశారు. తమ పేర్లు ఎందుకు చేర్చలేదంటూ ధర్నాకు దిగారు. హుజూరాబాద్-పరకాల రహదారిపై ఎస్సీ కాలనీ వాసులు బైఠాయించటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పథకంలో తమ పేర్లు చేర్చాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అటు వీణవంక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్సీలు ఆందోళన చేశారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అనర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు.
ఇదీచూడండి: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు కోసం ఎస్సీల ధర్నా