జగిత్యాల జిల్లాలో వర్షం వచ్చిందంటే జనం అల్లాడిపోతున్నారు. చిన్నపాటి వర్షాలకే రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలోని మల్లాపూర్ శివారులోని రహదారిపై కల్వర్టు కొట్టుకుపోవడంతో వరద ప్రవాహం దాటే సమయంలో ఇబ్బందులు తప్పడంలేదు. వర్షాలు కురిసి వరదొస్తే.. పాఠశాలకు వెళ్లేందుకు.. ఇంటికి చేరుకునేందుకు విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. మల్లాపూర్ శివారులోని ఆదర్శ పాఠశాలకు విద్యార్థులు నీటిలో వెళ్లాల్సి వస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం కుండపోతగా కురిసిన వర్షానికి వరద ప్రవాహం పెరగడంతో జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, గ్రామస్థులు ప్రవాహానికి అడ్డుగా ఉండి దాదాపు 600 మంది విద్యార్థులను క్షేమంగా బయటకు చేరవేశారు. ఇటీవలి భారీ వర్షాలకు రహదారితో పాటు కల్వర్టు కొట్టుకుపోవడంతో పాఠశాల వద్దకు బస్సులు, ఆటోలు, జీపులు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. మల్లాపూర్-ఖానాపూర్ మార్గంలో ప్రధాన రహదారి నుంచి దాదాపు కిలోమీటరు మేర విద్యార్థులు నడిచి వెళ్లాల్సి వస్తోంది.