rudrakshas in karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం న్యాలకొండపల్లిలో చెట్లకు రుద్రాక్షలు కాస్తున్నాయి. చల్లని వాతావరణం కలిగిన నేపాల్లో మాత్రమే కాసే పంటగా పేరున్న రుద్రాక్షలు.. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ఓ విశ్రాంత అధికారి పండిస్తున్నారు. మన దగ్గర వాతావరణం కూడా వీటి సాగుకు అనుకూలమని నిరూపించారు.
'తోటలో 14సంవత్సరాల కింద ఈ రుద్రాక్ష చెట్లు నాటాను. సంవత్సరాలు గడుస్తున్నా చెట్లు ఏపుగా పెరిగాయి కానీ ఫలాలు కాయలేదు. అయినా ఎటువంటి నిరాశ చెందకుండా వాటికి నీరు పెడుతూ పెంచసాగాను. అలా ఈ ఏడాది కాయలు చేతికి అందడంతో వాటి పై పొర తొలగించి త్రిముఖి రుద్రాక్షలు సేకరించాను. తోటలోని రుద్రాక్ష చెట్లు ఫలాలు అందించడంతో ఇన్నాళ్లు చేసిన శ్రమ ఫలించింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. తోటకు మూడు వైపులా గుట్టలు ఉండడంతో మిగతా చోట్ల కన్నా వాతావరణం చల్లగా ఉంటుంది. రుద్రాక్ష చెట్లు కాయడానికి అదే అనుకూలంగా మారింది.'
-విశ్రాంత అధికారి ఆకుల లక్ష్మయ్య, న్యాలకొండపల్లి కరీంనగర్